బ్రిస్బేన్: దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్ ఆడే తీరునే మార్చేసిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం దారుణంగా చతికిలపడుతున్నది. కంగారూల గడ్డపై ‘బజ్‌బాల్’ పప్పులుడకడం లేదు. యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో నాలుగు రోజుల్లో ముగిసిన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం తప్పలేదు. మూడో రోజుకే ఇంగ్లండ్ ఓటమి దాదాపుగా ఖరారైనప్పటికీ నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 134/6తో ఆట ఆరంభించిన ఆ జట్టు.. 241 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (50), విల్ జాక్స్ (41) పోరాడటంతో ఆ జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది.
మైకెల్ నెసర్ (5/42) అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ లోయరార్డర్ పనిపట్టాడు. అనంతరం 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్.. 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. ట్రావిస్ హెడ్ (22), తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 23*) వేగంగా ఆడారు. ఈ విజయంతో సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. మిచెల్ స్టార్క్‌కు వరుసగా రెండో టెస్టులోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.