ENG vs NZ | వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో అరుదైన రికార్డు నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లంతా డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (77; 4 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ జోస్ బట్లర్ (43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. వీరితో పాటు మిగిలిన వారంతా రెండంకెల స్కోర్లు చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒక జట్టుకు చెందిన 11 మంది ప్లేయర్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేయడం ఇదే తొలిసారి.
డేవిడ్ మలన్ (14), బ్రూక్ (25), మోయిన్ అలీ (11), లివింగ్‌స్టోన్ (20), సామ్ కరన్ (14), క్రిస్ వోక్స్ (11), ఆదిల్ రషీద్ (15 నాటౌట్), మార్క్ వుడ్ (13 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు.
2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసేలా కనిపించినా.. కివీస్ బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఇంగ్లండ్ హిట్టర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. మ్యాట్ హెన్రీ 3, ఫిలిప్స్, శాంట్నర్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లిష్ ప్లేయర్ల జోరుకు కల్లెం వేశారు. దీంతో మెరుగైన ఆరంభాలు లభించినప్పటికీ.. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పూర్తి స్థాయిలో కోలుకోకపోగా.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కూడా గాయం కారణంగా తొలి పోరుకు దూరంగా ఉన్నాడు