ముల్తాన్: ఇంగ్లండ్ చారిత్రక విజయంతో కదంతొక్కింది. పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. పరుగుల వరద పారిన ముల్తాన్ పిచ్‌పై ఇంగ్లిష్ జట్టు అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్‌నైట్ స్కోరు 152/6తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాక్..220 పరుగులకు పరిమితమైంది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు సల్మాన్అలీ ఆగా(63), ఆమెర్ జమాల్(55 నాటౌట్) అర్ధసెంచరీలతో పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ విజయాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. ఏడో వికెట్‌కు సల్మాన్, జమాల్ కలిసి 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్పిన్నర్ జాక్ లీచ్(4/30) విజృంభణతో పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తొలి సెషన్లో మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించేసింది. లీచ్‌కు తోడు అట్కిన్సన్(2/46), జాక్ లీచ్(2/30) రాణించడంతో ఇంగ్లండ్ గెలుపు సులువైంది.