వెల్లింగ్టన్: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ టెస్టు ఫార్మాట్లో మరే జట్టుకూ అందని అరుదైన ఘనతను నమోదుచేసింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు రెండో రోజు దూకుడైన బ్యాటింగ్‌తో టెస్టులలో 5 లక్షల పరుగులు పూర్తి చేసిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. 147 ఏండ్ల ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు ఇది 1,082వ టెస్టు. నాటి నుంచి వెల్లింగ్టన్ టెస్టు దాకా సుమారు 717 మంది క్రికెటర్లు ఈ రికార్డులో పాలుపంచుకున్నారు.
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సమఉజ్జీలైన ఆస్ట్రేలియా (4,28,860 రన్స్), భారత్ (2,78,751) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. బేసిన్ రిజర్వ్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న ఈ టెస్టులో పలు రికార్డులు నెలకొల్పిన ఇంగ్లీష్ జట్టు.. రెండో రోజు ఆట ము గిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 378/5 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 533 పరుగులు కాగా మరో మూడు రోజుల ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్‌లో కివీస్ కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే! అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 86/5తో రెండో రోజు ఆరంభించిన కివీస్.. 125 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో ఇంగ్లండ్‌కు 155 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ (4/31) హ్యాట్రిక్ నమోదుచేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (73 నాటౌట్) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. టెస్టులలో అతడికి ఇది 65వ అర్ధ సెంచరీ. తద్వారా అతడు టెస్టులలో 35 శతకాలు, 65 అర్ధ శతకాలు సాధించిన నాలుగో క్రికెటర్ (సచిన్, కలిస్, పాంటింగ్ ముందున్నారు)గా నిలిచాడు.