కార్డిఫ్: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో ఇంగ్లండ్ హార్డ్‌హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. కంగారూలు నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. 79 పరుగులకే విల్‌జాక్స్(12), జోర్డాన్ (0), కెప్టెన్ ఫిల్‌సాల్ట్(39) వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లండ్‌ను లివింగ్‌స్టోన్(87) ఆదుకున్నాడు.
ఆసీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ నాలుగో వికెట్‌కు జాకబ్ బెతెల్(44)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షార్ట్ (5/22) ఐదు వికెట్లతో రాణిం టచాడు. అంతకుముందు ఆసీస్.. జేక్ ఫ్రెజర్(50), ఇంగ్లిస్ (42) ఆకట్టుకోవడంతో 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. బ్రైడన్ కార్స్(2/26), లివింగ్‌స్టోన్(2/16) రెండేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన లివింగ్‌స్టోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం జరుగుతుంది.