Dawid Malan | ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20తో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచాడు ఈ ఎడమచేతివాటం బ్యాటర్. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గడంలో మలన్ కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ తరఫున 62 టీ20లు ఆడిన మలన్.. 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. 2022 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మలన్ కేవలం 15 ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలతో వన్డే క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు, 22 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
2023లో ప్రపంచకప్‌లో కనిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో సీనియర్ ఆటగాడికి చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా.. ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ముగిసిన ది హండ్రెడ్ 2024 టైటిల్ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో డేవిడ్ మలన్ సభ్యుడిగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ ఎస్ఏ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ ఏడాది ట్రోఫీని సాధించడంలో మలన్ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్లో పంజాబ్ జట్టు తరఫున 2021 కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు.