Ashes Series : ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్(Ashes Series) నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. బుధవారం నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అందుకు రెండు రోజుల ముందే తుది జట్టును వెల్లడించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేస్‌కు అనుకరించనున్న నేపథ్యంలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)ను తీసుకుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 19 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా.. అందులో తొలి రెండు టెస్టులను ఆసీస్ గెలుచుకుంది. మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న 40 ఏండ్ల అండర్సన్ మాంచెస్టర్ పోరుకు సిద్ధమవుతున్నాడు. ఓలీ రాబిన్సన్(Ollie Robinson) స్థానంలో జిమ్మీ బరిలోకి దిగనున్నాడు.
జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్
కౌంటీ క్రికెట్లో లాంక్షైర్ తరఫున మాంచెస్టర్ ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అండర్సన్ నుంచి ఆసీస్‌కు ముప్పు పొంచి ఉంది. సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యులుగా మారిని బ్రాడ్, అండర్సన్ జోడీ.. సమిష్టిగా సత్తాచాటితే ఇంగ్లండ్ జట్టు సిరీస్ సమం చేయడం ఖాయమే. ఇక గాయం కారణంగా ఓలీ పోప్ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మూడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ బ్యాటింగ్ చేయనున్నాడు.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, మోయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.