Kieron Pollard: వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి,ఆల్ రౌండర్, పొట్టి క్రికెట్ స్పెషలిస్టుగా పేరొందిన కీరన్ పొలార్డ్‌కు లక్కీ ఛాన్స్ దక్కింది. టీ20లలో వరల్డ్ ఛాంపియన్స్‌గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అతడు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. పొట్టి ఫార్మాట్లో ఇంగ్లండ్.. కీరన్ పొలార్డ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పొలార్డ్‌కు కోచ్‌గా ఇదే తొలి సవాల్. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగబోయే వరల్డ్ కప్‌లో అతడు ఇంగ్లండ్‌కు సేవలందించనున్నాడు. విండీస్ అతడి స్వదేశం కావడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే.
Kieron Pollard to join Men’s coaching team for the @T20WorldCup 🏏🏴#EnglandCricket | #T20WorldCup
— England Cricket (@englandcricket) December 24, 2023
ఇదే విషయమై ఈసీబీ స్పందిస్తూ… ‘వెస్టిండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్ ఇంగ్లండ్ పురుషుల జట్టు (టీ20) కోచింగ్ సిబ్బందిగా నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా పొలార్డ్ జట్టుతో జాయిన్ అవుతాడు..‘అని తెలిపింది. 2012 పురుషుల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న అతడి అనుభవం ఇంగ్లండ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈసీబీ వెల్లడించింది.