ENG vs NED: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు కాస్త ఊరట. మెగా టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లీష్ జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. మహారాష్ట్రలోని పూణే వేదికగా నెదర్లాండ్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 160 పరుగుల తేడాతో గెలిచింది. బట్లర్ సేన నిర్దేశించిన 340 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్.. 37.2 ఓవర్లలో179 పరుగులకే కుప్పకూలింది. తెలుగు మూలాలు ఉన్న నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ తేజ నిడమనూరు (34 బంతుల్లో 41 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ, అదిల్ రషీద్ లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
భారీ ఛేదనలో నెదర్లాండ్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఐదో ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ మ్యాక్స్ ఔడౌడ్ (5) వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ బ్యాటర్ కొలిన్ అకర్మన్ డకౌట్ అయ్యాడు. వెస్లి బరెసి (37), సిబ్రండ్ (33) ఫర్వాలేదనిపించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 55 పరుగులు జోడించారు. అయితే బరెసి రనౌట్ అవడంతో నెదర్లాండ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
England rise up to seventh with a big win and boost their chances of qualification for the 2025 Champions Trophy 🏴#ENGvNED #CWC23 pic.twitter.com/ASwoLL6Meo
— ESPNcricinfo (@ESPNcricinfo) November 8, 2023
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (38) క్రీజులో ఎక్కువసేపు నిలువలేదు. బస్ డీ లీడె (10), లొగాన్ వాన్ బీక్ (2)కూడా విఫలమయ్యారు. ఇంగ్లీష్ స్పిన్నర్లు అదిల్ రషీద్, మోయిన్ అలీలు నెదర్లాండ్స్ బ్యాటర్లను కుదురుకోనీయలేదు. తేజ పోరాడేందుకు అవకాశం ఉన్నా అతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఈ విజయంతో ఇంగ్లండ్.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో గత నెల 10న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. నెల రోజుల తర్వాత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్.. తమ చివరి మ్యాచ్‌ను ఈనెల 11న కోల్‌కతా వేదికగా పాకిస్తాన్‌తో ఆడనుంది.