న్యూఢిల్లీ: 8వ ఎలైట్ మహిళల జాతీయ బాక్సింగ్ పోటీలు(Elite Womens National Boxing Championship).. ఈనెల 21వ తేదీ నుంచి గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్దా యూనివర్సిటీలో జరగనున్నాయి. యూపీ బాక్సింగ్ అసోసియేషన్, వరల్డ్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వరంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. 1984, జనవరి ఒకటో తేదీ నుంచి 2005 డిసెంబర్ 31వ తేదీ మధ్య జన్మించిన వాళ్లు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. ప్రతి రాష్ట్ర యూనిట్ నుంచి సుమారు 10 మంది బాక్సర్లు పోటీపడేందుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. మార్చి 10వ తేదీలోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి 15వ తేదీన పేర్లను కన్ఫర్మ్ చేస్తారు.
ఎలైట్ వుమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్ ద్వారా.. భవిష్యత్తు చాంపియన్లను తయారు చేయవచ్చు అని, యువ ట్యాలెంట్ ను ప్రోత్సహిస్తున్నామని, వారిలో ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నామని, ఒలింపిక్స్ ప్రిపరేషన్లో ఇది భాగం అవుతుందని, రాబోయే మూడేళ్లలో బాక్సర్లను తీర్చిదిద్దవచ్చు అని బీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హేమంత కుమార్ కలిటా తెలిపారు.
మూడు రౌండ్ల ఫార్మాట్లో టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ప్రతి బౌట్లో మూడు నిమిషాల రౌండ్లు ఉంటాయి. ఒక నిమిషం రెస్ట్ పీరియడ్ ఉంటుంది. టెన్ పాయింట్ స్కోరింగ్ సిస్టమ్‌ను కచ్చితంగా అమలు చేయనున్నారు. వరల్డ్ బాక్సింగ్ టెక్నికల్ అండ్ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం టోర్నీ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ బాక్సర్లకు వెయిట్ టెస్ట్ చేయనున్నారు.