అనంతపూర్: దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా ‘సీ’ భారీ స్కోరు సాధించింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘బీ’తో జరుగుతున్న మ్యాచ్‌లో గైక్వాడ్ సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఇషాన్ కిషన్ సెంచరీతో మెరవగా రెండో రోజు మానవ్ సుతర్ (82), అన్షుల్ కంబోజ్ (38) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ‘బీ’ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి అభిమన్యు ఈశ్వరన్ (51 నాటౌట్), జగదీశన్ (67 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇండియా ‘డీ’తో జరుగుతున్న మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ‘డీ’.. 183 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టులో దేవ్‌దత్ పడిక్కల్ (92) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా మిగతా వారు విఫలమయ్యారు. కూలింగ్ గ్లాసెస్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ అయ్యర్ 7 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్, అకీబ్‌ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకున్న ‘ఏ’ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 115 రన్స్ చేసింది. తద్వారా 222 పరుగుల భారీ ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది.