చెన్నై : దేశవాళీలో ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈస్ట్‌జోన్ దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆట నాలుగో రోజే విజయం ఖాయమైన నేపథ్యంలో గురువారం ఆఖరి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 388/7 వద్ద డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆ జట్టు ఓవరాల్‌గా 760 రన్స్ లీడ్ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 212/5తో ఐదో రోజు బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్‌కు లోయరార్డర్లో ఖురేషి (116 నాటౌట్), అనుకుల్ రాయ్ (64) మెరుగ్గా ఆడి ఆధిక్యాన్ని మరింత పెంచారు.
లంచ్ విరామం తర్వాత 20 ఓవర్లు ఆడిన ఆ జట్టు అనుకుల్ నిష్క్రమణ తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. తద్వారా 2012-13 సీజన్ తర్వాత ఈస్ట్‌జోన్ ఖాతాలో మరో దులీప్ ట్రోఫీ టైటిల్ చేరింది. ఫైనల్లో అద్భుతంగా ఆడిన ఇషాన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సౌత్‌జోన్ సారథి తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.