Same Sex Marriages | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించలేమంటూ మంగళవారం భారత సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై భారత స్ప్రింటర్ ద్యుతీచంద్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ద్యుతీ స్పందిస్తూ.. ‘నేను నా పార్ట్నర్ మోనాలిసాను పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ సుప్రీం కోర్టు తీర్పుతో నా ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. మోనాలిసాతో నేను గడిచిన ఐదేండ్లుగా సహజీవనం చేస్తున్నా…
మేమిద్దరం చాలా సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాలలో నిర్ణయాలు తీసుకునే హక్కు మాకు ఉంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ పై పార్లమెంట్ చట్టం చేస్తుందని మేం ఆశిస్తున్నాం..’అని తెలిపింది. 2019లో ద్యుతీ తాను లెస్బియన్ అన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత క్రీడారంగంలో సేమ్ సెక్స్ రిలేషన్షిప్ గురించి వివరాలు వెల్లడించిన తొలి క్రీడాకారిణి ద్యుతీ.
ఇంకా ద్యుతీ మాట్లాడుతూ.. ‘మేం ఎవరినీ మాతో సంబంధం పెట్టుకోమని బలవంతం చేయడం లేదు. కానీ మా జీవితాన్ని మాకు నచ్చినవిధంగా బతికే హక్కు మాకుంది. మేమెందుకు సాధారణ జీవితాన్ని గడపకూడదు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ చాలా దేశాలలో చట్టబద్దంగా ఉంది. భారత్లో దానిని చట్టం చేస్తే తప్పేంటి..?’ అని ప్రశ్నించింది. ఇదిలాఉండగా ద్యుతీ తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.