Kirsty Coventry : అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో కొత్త అధ్యాయం మొదలైంది. 133 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఒక మహిళ చీఫ్గా ఎంపికయ్యారు. ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో థామస్ బాస్చ్ నుంచి సోమవారం క్రిస్టీ కొవెంట్రీ (Kristy Coventry) బాధ్యతలు స్వీకరించారు. తద్వారా ఐఓసీ అత్యున్నత పదవి చేపట్టిన మొదటి మహిళగా.. తొలి ఆఫ్రికా దేశస్థురాలిగా క్రిస్టీ చరిత్ర సృష్టించారు. లసాన్నేలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బాస్చ్ ఆమెకు ఒలింపిక్ హౌస్ తాళాలు అప్పగించారు. 41 ఏళ్ల క్రిస్టీ జూన్ 23 నుంచి ఐఓసీ చీఫ్ హోదాలో విధులు నిర్వర్తించనున్నారు.
ఒలింపిక్ డే సందర్భంగా తనను ఐఓసీ కొత్త చీఫ్గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా రాక్ స్టార్స్.. నాకు స్ఫూర్తి దివ్వెలు వీళ్లు’ అంటూ తన ఇద్దరు కూతుళ్ల వంక చూస్తూ ఆనందబాష్ఫాలు రాల్చారు క్రిస్టీ. ఎనిమిదేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. జింబాబ్వే దిగ్గజ స్విమ్మర్ అయిన క్రిస్టీ 2004, 2008లో ఒలింపిక్ పతకం సాధించారు.