RCB donations : ఐపీఎల్ (IPL) అంటే కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది దేశంలోనే ఒక క్రీడా పండుగలా మారిపోయింది. ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో క్రికెట్ ప్రేమికుల హంగామా మామూలుగా ఉండదు. తమ అభిమాన టీమ్ గెలువాలని అభిమానులు పరితపిస్తుంటారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నింటిల్లో కల్లా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) టీమ్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇది ఎవరూ కాదనలేని నిజం.
అయితే ఆర్సీబీ టీమ్‌లో పెద్ద సెలెబ్రిటీలు ఉన్నప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా కప్ గెలుచుకోకపోవడం దురదృష్టకరం. అందుకే ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ కప్ కొట్టాలని ఫ్యాన్స్ భారీగా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బెంగుళూరు టీమ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ సార్థక్ సచ్‌దేవా బెంగుళూరులో ఒక సోషల్ ఎక్స్పరిమెంట్ చేశాడు.
ఆర్సీబీ టీమ్ ఈసారి ఐపీఎల్ కప్ గెలవాలని కోరుకునే వారు గుడ్ లక్ కోసం రూ.10 దానం చేయాలని పోస్టర్లు ప్రింట్ చేయించాడు. ఆ పోస్టర్లను నగరమంతా అంటించాడు. ఆ పోస్టర్లపై క్యూఆర్ కోడ్, కోహ్లీ ఫొటో ఉంది. దాని కింద ‘డొనేట్ రూ.10 ఫర్ ఆర్సీబీ గుడ్ లక్’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన కూడా సార్థక్ ఒక వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు.
ఇప్పుడు సార్థక్ పెట్టిన పోస్టర్లు చూసి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ప్రాంక్ క్యూఆర్ కోడ్ నిజంగానే డొనేషన్స్ ఇస్తున్నారు. డొనేషన్స్ మాత్రమేగాక సోషల్ మీడియాలో సార్థక్ వీడియోకి 35 లక్షల వ్యూస్ కూడా లభించాయి. ఇదంతా చూసి నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు. ఒకరు ‘నయా బిజినెస్ ఐడియా గురూ’ అని రాస్తే.. ఓ అమ్మాయి ‘ఇంత చేశాక.. ఈసారి కూడా ఆర్సీబీ గెలువకపోతే నేను ఏడ్చేస్తా’ అని కామెంట్ చేసింది.
ఇక ఐపీఎల్ పాయింట్ల పట్టిక చూస్తే ప్రస్తుతం బెంగళూరు టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో 7 గెలిచింది. సొంత గ్రౌండ్లో ఆడిన మూడు మ్యాచ్‌లు ఆర్సీబీ ఓడిపోయింది. ఇది ఆర్సీబీ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇకపై ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే జరగనున్నాయి. దాంతో హోంగ్రౌండ్లో కూడా కోహ్లీ టీమ్ రాణించాలని అభిమానులు మొక్కుకుంటున్నారు.