న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్స్ లో పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తన జావెలిన్ తీసుకున్నాడని నీరజ్ చోప్రా చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. నీరజ్ జావెలిన్‌ను నదీమ్ దొంగిలించాడని ఆరోపిస్తూ.. అతడు ఈ సిగ్గుమాలిన పని చేయకుంటే భారత అథ్లెట్ ఇంకా ఎక్కువ దూరం విసిరేవాడని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెట్టారు. ఈ కామెంట్లపై నీరజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వివాదంలోకి తనను లాగొద్దని, తన పేరునూ వాడొద్దని విజ్ఞప్తి చేశాడు. ట్విట్టర్ వేదికగా నీరజ్ స్పందిస్తూ.. ‘మీ స్వార్థ ప్రయోజనాలు, ప్రచారం కోసం దయచేసి నా పేరు వాడకండి. క్రీడలు మనకు ఐక్యతను నేర్పుతాయి. నేను మాట్లాడిన దానిపై ద్వంద్వార్థాలు తీస్తూ సోషల్ మీడియాలో వివాదాన్ని రేపుతున్న దానిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను’ అన్నాడు. అర్షద్ నదీమ్ తన జావెలిన్‌ను తీసుకోవడంలో తప్పేమీ లేదన్న నీరజ్.. ఇదంతా ఆటలోని నిబంధనల్లో భాగమేనని చెప్పుకొచ్చి నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.