బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం జోరుగా కొనసాగుతున్నది. ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు నిధుల వరద పారిస్తున్నాయి. పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీపడి ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. కోట్ల రూపాయల వెచ్చిస్తున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన వేలం ఆదివారం రాత్రికి ముగియనున్నది.
రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి మొత్తం 123 మంది ఆటగాళ్ల వేలం పూర్తయ్యింది. వారికోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.442.05 కోట్లను ఖర్చు చేశాయి. ఇంత ఖర్చుపోను ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని నిధులు మిగిలి ఉన్నాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఎవరి దగ్గర ఇంకా ఎన్ని నిధుల మిగిలి ఉన్నాయో తెలుసుకుందాం..
అత్యధికంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దగ్గర రూ.25.90 కోట్లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం దగ్గర రూ.15.75 కోట్లు, గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.14.65 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ.13.35 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ దగ్గర రూ.11.10 కోట్లు, పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.10.65 కోట్లు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ రూ.9.55 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.9.25 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.3.30 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.95 కోట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.