ఢిల్లీ: భారత క్రీడా రంగానికి మరుపురాని విజయాలను, తీపి గుర్తులను అందించిన 2025 మరో ఐదు రోజుల్లో ముగియబోతున్నది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై మన క్రీడాకారులు సత్తాచాటారు. మరీ ముఖ్యంగా అబ్బాయిలతో పోలిస్తే మహిళా క్రీడాకారిణులు అంచనాలకు మించి రాణించి ప్రపంచ క్రీడా యవనికపై మువ్వన్నెల పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. క్రికెట్లో మహిళల వన్డే ప్రపంచకప్, చెస్‌లో దివ్య దేశ్‌ముఖ్ కొత్త మహారాణిగా అవతరించడం, ఆర్చరీలో శీతల్ దేవి చూపిన తెగువ.. వంటి ఎన్నో ఘనతలు ఈ ఏడాదే సొంతమయ్యాయి. ఏడాదికి వీడ్కోలు చెప్పబోతున్న సందర్భంగా పలు క్రీడల్లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అందుకున్న ఘనతలు, చేదు ఓటములు, మరుపురాని క్షణాలపై ప్రత్యేక కథనం.
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అయితే పురుషులతో పాటు మహిళలూ ఈ ఆట ఆడుతున్నా.. మెన్స్ టీమ్స్కున్న సౌకర్యాలు, వారికున్నంత ఆకర్షణ, వేతనాల్లో వివక్ష వంటి ఎన్నో ఇబ్బందులను ‘ఉమెన్ ఇన్ బ్లూ’ ఎదుర్కున్నది. దీనికి తోడు భారత ఖాతాలో ఎన్నో దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ కలను స్వదేశంలో అయినా ఒడిసిపట్టాలనే ఒత్తిడి.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ టోర్నీ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సగర్వంగా ఐసీసీ కప్పు కలను నెరవేర్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో సో సో గానే ఉన్న భారత ప్రదర్శన.. సెమీస్‌కు చేరాక శిఖర స్థాయిని చేరుకుంది. ప్రపంచకప్ విజయం భారత మహిళా క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చివేసిందని చెప్పడంలో వీసమెత్తు సందేహం అక్కర్లేదు. ఈ ఏడాది అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను భారత్ రిటైన్ చేసుకుంది. పురుషుల క్రికెట్లో మాత్రం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్నా స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులను కోల్పోయి అవమానకర ఓటమిని మూటగట్టుకుంది.
ఈ ఏడాది భారత క్రీడారంగంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడల్లో ఒకటి షూటింగ్. మను భాకర్ వంటి స్టార్ షూటర్లకు ఈ ఏడాది కలిసిరాకపోయినా సురుచి సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్, సామ్రాట్ రాణా వంటి యువ షూటర్లు మాత్రం అదరగొట్టారు. ఏడాది పొడుగునా ఈ త్రయం నిలకడగా పతకాలు సాధించింది. బ్యూనస్ ఎయిర్స్లో మొదలైన ప్రపంచకప్ ఆరంభ సీజన్ నుంచి మొన్నటి దోహాలో ముగిసిన సీజన్ ఎండింగ్ ఫైనల్స్ దాకా పతకాలు కొల్లగొట్టారు.19 ఏండ్ల జజ్జర్ అమ్మాయి సురుచి అయితే మిగిలిన షూటర్ల కంటే మెరుగ్గా రాణించి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకాన్ని తీసుకొచ్చే అథ్లెట్ల రేసులో నిలిచింది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ కూడా కీలక టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసింది.
గత కొన్నేండ్లుగా నిలకడగా ఎదుగుతున్న భారత చదరంగం.. ఈ ఏడాది కొత్త ఎత్తులకు చేరింది. 2024లో గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా నిలువగా 2025లో దివ్య దేశ్‌ముఖ్ ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుని ఈ టోర్నీ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఇందుకు సంబంధించిన ఫైనల్లో దివ్య ప్రత్యర్థి కోనేరు హంపియే కావడం మరో విశేషం. ఒక్క విజయంతో వరల్డ్ కప్ సొంతం చేసుకోవడమే గాక 19 ఏండ్ల ఈ నాగ్‌పూర్ అమ్మాయి.. గ్రాండ్‌మాస్టర్ హోదాతో పాటు 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ ఏడాది భారత్.. గోవాలో చెస్ వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించింది. నిరుడు వరుస విజయాలతో సత్తాచాటిన గుకేశ్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ప్రజానంద, అర్జున్ ఇరిగేసి కీలక టోర్నీల్లో నిలకడగా ఆడారు.
దశాబ్దాలుగా భారత బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ భారాన్ని మోస్తున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు కెరీర్ చరమాంకంలో ఉంది. సైనా నెహ్వాల్ కూడా ఆట నుంచి తప్పుకుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సింధు వరుస వైఫల్యాలతో చతికిలపడుతున్న వేళ.. ఉమెన్స్ సింగిల్స్‌లో వీరి తర్వాత ఎవరా? అన్న ప్రశ్నకు తామున్నామని భరోసా ఇస్తున్నారు ఇద్దరు యువ షట్లర్లు. వారే ఉన్నతి హుడా, తన్వి శర్మ. జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న ఈ ఇద్దరూ 2025లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించి మహిళల విభాగంలో కొత్త ఆశలు రేపుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన చైనా ఓపెన్‌లో ఉన్నతి.. సింధును ఓడించి సంచలనం సృష్టించింది. ఆమె ప్రస్తుతం టాప్-15 ర్యాంకుకు చేరడం గమనార్హం. అక్టోబర్‌లో అసోం వేదికగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో తన్వి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రజతం గెలిచింది.
ఆర్చరీలోనూ ఈ ఏడాది భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలే చేసింది. ఈ క్రీడలో ఎవరూ ఊహించని విధంగా రెండు చేతులు లేకున్నా ప్రపంచ వేదికలపై సత్తాచాటి అందరినోట శెభాష్ అనిపించుకుంది మాత్రం శీతల్ దేవి. 18 ఏండ్ల శీతల్.. పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించడమే గాక గ్వాంగ్జు (దక్షిణ కొరియా)లో జరిగిన వరల్డ్ చాంపియన్ పారా ఆర్చరీ ఫైనల్లో ఒజ్నుర్ గిర్డి (టర్కీ)కి షాకిచ్చింది. ఇదే టోర్నీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలిచింది. అంతేగాక వైకల్యపు అడ్డుగోడల్ని బద్దలుకొడుతూ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే ఆర్చర్లు పాల్గొనే టోర్నీలోనూ ఆడి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. ఇక మిగిలిన ఆర్చర్ల విషయానికొస్తే కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేశారు. ఫలితంగా ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఏకంగా 10 పతకాలు సాధించి ఈ టోర్నీలో దక్షిణ కొరియా ఆధిపత్యానికి గండికొట్టింది.