ఆగస్టు 7, 2024 బుధవారం.. భారత ప్రజలు ఒక చేదువార్తతో తమ రోజును ప్రారంభించారు! ఏండ్ల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పసిడి పతక పోరుకు అర్హత సాధించిన యువ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు వార్త దేశ క్రీడాభిమానులను కలవరపాటుకు గురిచేసింది. పోరాటాన్నే తమ శ్వాసగా మలుచుకున్న హర్యానా మల్లయోధురాలు పారిస్ ఒలింపిక్స్ నుంచి అనూహ్యంగా వైదొలిగిన వైనం బాధించింది. కచ్చితంగా స్వర్ణ పతకంతో భారత గడ్డపై అడుగుపెడుతుందనుకున్న వినేశ్..అధిక బరువు రూపంలో అనర్హత వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. 100 గ్రాముల వ్యత్యాసం ఆమెను పోటీకి దూరం చేసింది. ఉదయం వేళ నిర్వహించిన బరువు పరీక్షలో వినేశ్ నిర్దేశిత బరువు కంటే అధికంగా ఉండటంతో నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. కోట్లాది అభిమానగణం ఆశలు ఒక్కసారిగా ఊసూరుమన్నాయి. ఈసారైనా ఒలింపిక్స్ పతకంతో తన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకుందామనుకున్న వినేశ్ ఆశలు అడిఆశలయయ్యాయి. రియో, టోక్యో ఒలింపిక్స్ లాగే పారిస్ కూడా ఫోగాట్‌కు పీడకలగానే మిగిలిపోయింది.
Vinesh Phogat | పారిస్: దురదృష్టం దబ్బపండంత ఉంటే ఏం లాభం! అదృష్టం ఆవగింజంత ఉండాలని అంటారు మన పెద్దలు. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ విషయంలోనూ ఇదే జరిగింది. గత రెండు ఒలింపిక్స్‌లను తలపిస్తూ పారిస్‌లోనూ వినేశ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. రియోలో కాలు విరిగితే..టోక్యోలో ఆదిలోనే ఓటమి..ఇప్పుడు పారిస్‌లో అనర్హత వేటు ఫోగాట్ పతక కలను చిదిమేశాయి. గత ఏడాది కాలంగా పాలకులతో చేస్తున్న పోరాటం ఓవైపు అయితే తనపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బౌట్లో శక్తికి మించి పోరాడిన వినేశ్..పారిస్‌లో పతకమే లక్ష్యంగా పోటీకి దిగింది. తన రెగ్యులర్ విభాగం 53కిలోలు కాకుండా ఈసారి 50కిలోల కేటగిరీ ఎంచుకున్న ఫోగాట్‌కు యు సుసాకీ రూపంలో ఫెవరేట్ ఎదురైనా వెరువకుండా పోరాడి సంచలన విజయం సాధించింది. అదే జోరులో క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ఇక్కడి వరకే బాగానే ఉంది. బుధవారం ఉదయం పారిస్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. జుమాన్ లోపెజ్‌తో సెమీస్ బౌట్ ముగిసిన తర్వాత వినేశ్ తన బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది.
రాత్రంతా నిద్రలేకుండా
బరువును తగ్గించుకునే క్రమంలో వినేశ్ నిద్రలేని రాత్రి గడిపింది. సెమీస్ బౌట్ ముగిసిన తర్వాత నుంచి మొదలుపెడితే బుధవారం ఉదయం వరకు స్వెట్సూట్ ధరించి స్కిప్పింగ్, వాకింగ్ లాంటి వ్యాయమాలతో పాటు ఆవిరి స్నానం వంటి చేశారు. చెమట రావడం ఆగిపోవడంతో ఆఖరి ప్రయత్నంగా తల జట్టును కట్ చేయడంతో పాటు జెర్సీ సైజును తగ్గించారు. అయినా నిర్దేశిత బరువు కంటే వినేశ్ 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలింది. బరువు తగ్గించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని భారత బృందం చేసిన విజ్ఞప్తిని అధికారులు తోసిపుచ్చారు. దీంతో అప్పటి వరకు మన కోచింగ్ స్టాఫ్ చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనలు అనుసరించి చాప్టర్-3, ఆర్టికల్ 11 ప్రకారం పోటీలు జరిగే రెండు రోజులు రెజ్లర్ల బరువును పరీక్షిస్తారు. వారు పోటీలో ఉన్న వెయిట్ కేటగిరీని అనుసరించి ఒక్కో ప్లేయర్‌కు 30నిమిషాల సమయం ఇస్తారు. ఈ సమయంలో ఒక్కో ప్లేయర్ ఎన్ని సాైర్లెనా తమ బరువును పరిశీలించుకునే అవకాశముంటుంది. రెండో రోజు ఫైనల్‌తో పాటు రెపిచేజ్‌లో పాల్గొనే రెజ్లర్లకు బరువు నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. అయితే ఇది 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ లాంటి పోటీల్లో మాత్రమే బరువులో వ్యత్యాసం ఉంటే అనుమతిస్తారు. కానీ ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో నిర్దేశిత బరువు కంటే ఏ మాత్రం ఎక్కువ ఉన్నా..అనర్హత వేటు వేస్తారు. దీనికి తోడు ఒకవేళ బరువు పరీక్షలకు గైర్హాజరు అయితే సదరు ప్లేయర్‌పై వేటు వేయడంతో పాటు చివరి ర్యాంక్ కేటాయిస్తారు. వినేశ్ విషయంలోనే అదే జరిగింది. ఇప్పటి వరకు తన కెరీర్లో ఇలాంటి సందర్భం ఎప్పుడు ఎదుర్కొని వినేశ్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన మొదటిసారే అనూహ్యంగా వైదొలిగింది.
ఫోగాట్ స్థానంలో లోపెజ్
వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమె స్థానంలో క్యూబాకు చెందిన యుసెన్లిస్ గుజ్మన్ లోపెజ్కు ఫైనల్లో ఆడే అవకాశం కల్పించారు. ఫోగాట్‌పై తొలి రౌండ్లో ఓడిన యు సుసాకీ కాంస్య పోరులో తలపడనుంది. దీంతో ఈ విభాగంలో నాలుగు కాకుండా రెజ్లర్లు మూడు పతకాలకే పరిమితం కానున్నారు.
మూడోసారీ దురదృష్టం
వినేశ్ ఫోగాట్‌ను మూడోసారి దురదృష్టం నీడలా వెంటాడింది. రియో(2016) ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాల మధ్య బరిలోకి దిగిన వినేశ్ అనూహ్యంగా తొలి రౌండ్లోనే కాలి గాయంతో నిష్క్రమించింది. నొప్పికి బౌట్‌లోనే విలవిలలాడిపోయిన వినేశ్ కన్నీరు కారుస్తూ భారంగా వైదొలింది. ఆ తర్వాత టోక్యోలోనూ దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. క్వార్టర్స్‌లో ఓటమితో పతక రేసు నుంచి తప్పుకుంది. మూడేండ్ల తర్వాత జరుగుతున్న పారిస్‌లోనైనా తన కలను సాకారం చేసుకుందామనుకుని పోటీకి దిగిన వినేశ్‌కు బరువు రూపంలో అనర్హత వేటు పడింది. మొత్తంగా మూడు ఒలింపిక్స్ వినేశ్‌కు చేదు అనుభవమే మిగిల్చాయి.
100 గ్రాములే తేడా
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడటానికి 100 గ్రాముల అధిక బరువే తేడా కావడం గమనార్హం. మామూలుగా ఒలింపిక్స్ లాంటి మెగాటోర్నీల్లో ఒక్కో విభాగంలో పోటీలు రెండు రోజులు సాగుతాయి. వినేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 50కిలోల విభాగంలో మంగళవారం పోటీలు మొదలు కాగా, బుధవారం ఫైనల్‌తో పాటు కాంస్య పతక పోరు షెడ్యూల్ ఉంది. అయితే మంగళవారం ఉదయం జరిపిన బరువు పరీక్షలో వినేశ్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పోటీలకు అనుమతి లభించింది. ఒక్కసారి బరువు నిర్ధారణ జరిగిన తర్వాత బౌట్లో కొట్లాడే సత్తా ఉండేందుకు న్యూట్రీషియన్ సిఫారసులకు అనుగుణంగా ఆహారం అందిస్తారు. దీనికి తోడు తక్కువ మోతాదులోనే నీళ్లు తాగిస్తారు. తొలి రోజు ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో ఆడిన వినేశ్‌కు రెండో రోజైన బుధవారం ఉదయం మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఇందు కోసం ఒక్కో ప్లేయర్‌కు సమయం కేటాయిస్తారు. అయితే ముందు రోజు రాత్రికి ఉదయం నాటికి వినేశ్ బరువులో దాదాపు రెండు కేజీలకు పైగా తేడా కనిపించింది.
ఫోగాట్‌కు అస్వస్థత
మూడు బౌట్లలో పోరాడి గెలిచిన వినేశ్ ఫోగాట్ మంగళవారం రాత్రి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. బరువు తగ్గించుకునే క్రమంలో ఆహారంతో పాటు నీరు త్రాగడం ఆపేసింది. దీంతో ఉదయం బరువు లెక్కించే సమయానికి పూర్తిగా నీరసించి పోయిన ఫోగాట్ అస్వస్థతకు లోనైంది. దీంతో గేమ్స్ విలేజ్‌లో ఆమెకు వైద్య సేవలు అందించారు. శరీరం సత్తువ కోల్పోవడంతో యూవీ ఫ్లూయిడ్స్ ద్వారా తక్షణ శక్తి అందించే ప్రయత్నం చేశారు.
ఆటలో ఇదంతా భాగం- వినేశ్
నిర్దేశిత బరువు మించడంతో అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫోగాట్ ఆటలో ఇదంతా భాగమని పేర్కొంది. తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న తనను పరమార్శించేందుకు వచ్చిన భారత కోచ్‌లు వీరేందర్ దహియా, మంజీత్రాణితో వినేశ్ ముచ్చటించింది. ఫోగాట్‌పై అనర్హత వేటు వార్త తెలిసి భారత రెజ్లింగ్ బృందం నిరాశకు లోనయ్యిందని కోచ్‌లు పేర్కొన్నారు. వీరితో పాటు పలువురు ఐవోఏ అధికారులు..వినేశ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు.
అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానానికి..
100 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురైన వినేశ్ ఫోగాట్..అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(సీఏఎస్)ను ఆశ్రయించింది. మహిళల 50కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్లో ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వకపోవడంపై సీఏఎస్కు ఫోగాట్ ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరుపాలని అభ్యర్థించింది. సంయుక్తంగా రజత పతక విజేత ప్రకటించాలంటూ కోర్టును వేడుకుంది. మరీ ఈ విషయంలో సీఏఎస్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
పోరాటమే శ్వాసగా..
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన్పపటి నుంచి వినేశ్ ఫోగాట్ ఇంటాబయటా పోరాడుతున్నది. ఓవైపు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్శరణ్ సింగ్ అరాచకాలపై సహచర రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో కలిసి ఢిల్లీ నడివీధుల్లో గిరిగీసి కొట్లాడింది. పాలకులకు వ్యతిరేకంగా గళం విప్పుతూ నెలల తరబడి దీక్షకు కూర్చుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంతకు స్పందించకపోవడంతో పార్లమెంట్‌కు బయల్దేరిన క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తూ రెజ్లర్లను ఈడ్చిపడేయడాన్ని దేశం యావత్తు గమనించింది. మహిళా రెజ్లర్లపై జరిగిన లైంగిక దాడి నిందితులను శిక్షించకపోతే తాము సాధించిన పతకాలను గంగానదిలో విసిరేస్తామని ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఎట్టకేలకు దిగి వచ్చిన కేంద్రప్రభుత్వం ఐవోఏ సమక్షంలో ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఓవైపు పాలకులతో పోరాడిన వినేశ్ మరోవైపు దేశానికి పతకాన్ని అందించేందుక అహర్నిశలు శ్రమించింది. తాను రెగ్యులర్‌గా పోటీపడే 53కిలోల విభాగం కాకుండా ఈసారి ఒలింపిక్స్‌లో 50కిలోలకు మారింది. అయినా వెరవకుండా గత ఫిబ్రవరి నుంచి తన శరీర బరువును తగ్గించుకునేందుక అన్ని రకాలుగా ప్రయత్నించింది. దాదాపు 6 నుంచి 7 కిలోల బరువు తగ్గింది. ఒలింపిక్స్ ట్రయల్స్ విషయంలో ఇబ్బందులు పెట్టినా..సీనియార్టీ అడ్డుపెట్టుకుని హాజరుకాలేదన్న అపవాదు వేసినా వెనుకకు తగ్గలేదు. దేశానికి ఏదో ఒక రోజు పతకం అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు నడిచింది. అందుకు తగ్గట్లు విదేశాల్లో కోచింగ్ తీసుకుంది.
– ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష
– భారత బృందం చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్శా పార్ధివాలా