బెంగళూరు : ఈనెల 28 నుంచి బెంగళూరు వేదికగా మొదలుకానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 752 పరుగులు సాధించి జోరుమీదున్న గిల్.. 15 మంది సభ్యులతో కూడిన నార్త్జోన్నూ నడిపించనున్నాడు.
యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ సెంట్రల్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వాస్తవానికి దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 15న ముగియనుండగా అంతకంటే ముందే యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలుకానుంది. ఒకవేళ గిల్ గనక ఆసియా కప్‌లో భారత జట్టుకు ఎంపికైతే అతడు దులీప్ ట్రోఫీ మధ్యలోనే జట్టును వీడతాడు. గిల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా సైతం ఆసియా కప్‌నకు జట్టులో చోటు దక్కించుకుంటే వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయనున్నారు.