కొలంబో: భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (177 బంతుల్లో 115 నాటౌట్) తన సత్తా, ఫామ్‌పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. సిరీస్‌కు ముందు ఫామ్‌లేమితో ఇబ్బంది పడి తుది జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మార్చుకున్న జురెల్ ప్రశాంతంగా.. ప్రభావవంతంగా ఆడుతూ రెండో టెస్టులో అద్భుత శతకం కొట్టి టీమ్ మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతని క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కొలంబో టెస్టును భారత్ శాసించే స్థితిలో నిలిచింది. రిషబ్ పంత్ (89 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) కూడా ఫిఫ్టీతో మెప్పించడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 138 ఓవర్లలో 503/9 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
వర్షం అంతరాయం కారణంగా దాదాపు సగం రోజు ఆట తుడిచిపెట్టుకోపోయిన సోమవారం చివరకు తొలి ఇన్నింగ్స్‌లో లంక 3 ఓవర్లలో 8/2తో నిలిచింది. స్లిప్‌లో జైస్వాల్ పట్టిన చురుకైన క్యాచ్‌తో ఓపెనర్ లాహిరు ఉదార (1)ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చగా, నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ప్రభాత్ (2)ను స్పిన్నర్ సుతార్ ఎల్బీ చేశాడు. కమిల్ మిషార (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో మరో 8 వికెట్లున్న లంక భారత్ స్కోరుకు ఇంకా 495 రన్స్ దూరంలో ఉంది. మన బౌలర్లు ఇదే జోరు కొనసాగించి మూడో రోజు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా చేతుల్లోకి వచ్చేస్తుంది.
తొలి టెస్టులో అర్ధ శతకంతో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్న జురెల్ కొలంబోలో మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. రిస్క్ లేకుండా పరుగులు రాబడుతూ.. పరిస్థితిని అర్థం చేసుకొని ఆడుతూ తన కెరీర్‌ను నిలబెట్టే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆట ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాటర్ సారాంశ్ జైన్ (6)ను అసిత ఫెర్నాండో ఔట్ చేయడంతో లంక పుంజుకునేలా కనిపించింది. కానీ, ఆతిథ్య జట్టుకు జురెల్ ఆ చాన్స్ ఇవ్వలేదు. తొలి రోజు 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయి తిరిగి బ్యాటింగ్‌కు దిగిన సీనియర్ కీపర్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పరిస్థితిని అర్థం చేసుకొని తొలుత పంత్‌కు ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చాడు.
దాదాపు రెండు గంటల పాటు కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేసిన పంత్.. లంక పేసర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అసిత, కుమార బాడీలైన్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టారు. ఓ బంతి పంత్ భుజానికి కూడా తగిలింది. కుమార బౌలింగ్‌లో హూక్ షాట్‌తో ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టిన రిషబ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు మంచి షాట్లతో అలరించిన అతను.. స్పిన్నర్ నువంతా బౌలింగ్‌లో ఫోర్‌తో ఫిఫ్టీ (81 బంతుల్లో) పూర్తి చేసిన తర్వాత ప్రభాత్ ఓవర్లో సిక్స్ కొట్టాడు. మరోవైపు చక్కగా స్ట్రయిక్ రొటేషన్ చేసిన జురెల్.. ప్రభాత్ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధ శతకం (97 బంతుల్లో) అందుకున్నాడు. ఫలితంగా భారత్ 419/6తో తొలి సెషన్ ముగించింది.
లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే లంక ఈ జోడీని విడదీసింది. నువంతా బౌలింగ్‌లో లాఫ్టెడ్ షాట్‌కు ట్రై చేసిన పంత్.. ఉదారకు సింపుల్ క్యాచ్ ఇవ్వడంతో ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత 12 టెస్టుల అనుభవం ఉన్న జురెల్‌పై పడింది. అయితే చివరి వరుస బ్యాటర్లతో కలిసి అతను ఓ వెటరన్ ఆటగాడి మాదిరిగా పరుగులు జోడించాడు. మానవ్ సుతార్ (51 బంతుల్లో 18)తో ఎనిమిదో వికెట్‌కు 39, సిరాజ్ (29 బంతుల్లో 3)తో తొమ్మిదో వికెట్‌కు 31 రన్స్ జోడించాడు.
ఎంతో ఓపికగా క్రీజులో నిలిచిన జురెల్ ఎక్కువగా బ్యాక్ ఫుట్‌పై ఆడుతూ.. చెత్త బంతులకు మాత్రమే షాట్లు కొట్టాడు. తను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షంతో ఆటకు చాలాసేపు అంతరాయం కలిగింది. ఆట తిరిగి మొదలైన తర్వాత అసిత బౌలింగ్‌లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. హెల్మెట్ తీసి తన తన ఎడమ చేయి కండపై హిందీలో ‘జై జవాన్, జై కిసాన్’ అని రాసున్న టాటూనూ డ్రెస్సింగ్ రూమ్‌లోని టీమ్‌మేట్స్‌కు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. సెంచరీ దాటిన వెంటనే గేరు మార్చిన అతను అసిత బౌలింగ్‌లో లాంగాఫ్, స్కేర్ లెగ్ మీదుగా సిక్సర్లు కొట్టాడు. స్కోరు 500 దాటిన వెంటనే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
2 టెస్టుల్లో జురెల్‌కు ఇది రెండో శతకం. గతేడాది అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై తొలి సెంచరీ సాధించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 138 ఓవర్లలో 503/9 డిక్లేర్డ్ (పడిక్కల్ 117, జురెల్ 115*, పంత్ 63, అసిత ఫెర్నాండో 4/106);
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 3 ఓవర్లలో 8/2 (మిషార 5 బ్యాటింగ్, ప్రసిద్ధ్ 1/1)