ముంబై: స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన మెరుగు పర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యానికి వివరించాడు. దీంతో మరోసారి మహేంద్రసింగ్ ధోనీని సారథిగా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ‘జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి జట్టు పగ్గాలు చేపట్టాలని ధోనీని కోరగా.. మహీ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు’ అని చెన్నై ఫ్రాంచైజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిరుడు చెన్నై జట్టును విజేతగా నిలిపిన మహేంద్రుడు.. తాజా సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్-15లో చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా.. బంతితోనూ, బ్యాట్‌తోనూ మునుపటి మెరుపులు మెరిపించలేకపోతున్నాడు.