Wisden missed Dhoni | క్రికెట్ బైబిల్‌గా పిలుచుకునే విజ్డెన్ మ్యాగజైన్ ఇండియా ఆల్-టైమ్ టీ20 జట్టును ఎంపికచేసింది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. భారత్‌కు తొలి టీ20 వరల్డ్ కప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోనీని ఈ మ్యాగజైన్ పక్కన పెట్టింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు విజ్డెన్ జాబితాలో చోటు దక్కింది. ఆల్-టైమ్ టీ20 జట్టు వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంపికచేసి ధోనీ అభిమానులను నిరాశపరిచారు.
విజ్డెన్ మ్యాగజైన్ మంగళవారం రాత్రి జట్టును ప్రకటించింది. తాము ఎంచుకున్న ప్రమాణం ప్రకారం జట్టును ఎంపిక చేయడం అంత సులభం కాదని సదరు పత్రిక పేర్కొన్నది. విజ్డెన్ పత్రిక ఆల్-టైమ్ టీ20 జట్టులో రోహిత్‌శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, సురేష్ రైనా, దినేష్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, అశిష్ నెహ్రా, వీరేందర్ సెహ్వాగ్ ఉన్నారు.
కాగా, మహేంద్ర సింగ్ ధోనీని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో సాధన చేస్తున్న ఏడుగురు ఆటగాళ్లకు జాబితాలో చోటుదక్కగా.. 2007 వరల్డ్ చాంపియన్‌షిప్ జట్టు నుంచి నలుగుర్ని తీసుకున్నారు. ధోనీకి బదులుగా దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవడం పట్ల సదరు పత్రిక యాజమాన్యం పలు కారణాలను వెల్లడించినప్పటికీ.. ధోనీ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.