ఉప్పల్, నమస్తే తెలంగాణ ఆటప్రతినిధి: ప్రతిభ కల్గిన యువకులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వేదికగా మరో క్రికెట్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పేరిట హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీకి అంకుర్పారణ పడింది. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) చైర్మన్ మాల్క కొమురయ్య, ధోనీ క్రికెట్ అకాడమీ(ఎమ్ఎస్డీసీఏ) ఎండీ మిహిర్ దివాకర్ మధ్య ఎంవోయు కుదిరింది. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ ‘దేశంలోని నలుమూలల నుంచి ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాం. కనీస సౌకర్యాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని చేరదీసి అత్యుత్తమ శిక్షణ కల్పిస్తాం. అనుభవజ్ఞులైన కోచ్‌ల సమక్షంలో క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి తర్ఫీదు ఇస్తాం. వచ్చే ఏడాదికి హైదరాబాద్‌లో ఏడు నుంచి ఎనిమిది సెంటర్లు ప్రారంభిస్తాం. ఆ తర్వాత దశలో తెలంగాణ వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో అకాడమీలు నెలకొల్పుతాం. పేదరికం నుంచి వచ్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే పిల్లలకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యాలు అందిస్తాం’ అని అన్నాడు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో క్రికెట్‌కు బాగా క్రేజ్ ఉందని, ధోనీ లాగా ఇక్కడి యువకులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.