Dewald Brevis : ‘కూల్ కెప్టెన్’గా మనందరికీ తెలిసిన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) యువతరానికి మార్గదర్శకుడు కూడా. మైదానంలో వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన మహీ భాయ్ ప్రస్తుతం ఎంతోమంది కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తనకు కూడా ధోనీ అంటే ఎంతో గౌరవమని, అతడు అద్భుతమైన వ్యక్తి అని అంటున్నాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis). ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఈ యువకెరటం తాలాతో తన అనుభవాలను పంచుకున్నాడు. వెటరన్ ప్లేయరతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో పాటు అతడి నుంచి నేర్చుకున్న విషయాలను ప్రస్తావించాడీ సీఎస్కే స్టార్.
ఈమధ్యే ఆస్ట్రేలియాపై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన బ్రెవిస్ టీ20ల్లో కొత్త సంచలనంగా అవతరించాడు. జూనియర్ డివిలియర్స్ ట్యాగ్‌తో రెచ్చిపోతున్న ఈ చిచ్చరపిడుగు శుక్రవారం ధోనీతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమ దేశపు దిగ్గజం డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన బ్రెవిస్.. జట్టు సభ్యులకు ధోనీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని అన్నాడు.
Dewald Brevis talks about the greatness of MS Dhoni. 🐐#Cricket #Brevis #Dhoni #Sportskeeda pic.twitter.com/pUR8ccHThI
— Sportskeeda (@Sportskeeda) September 4, 2025
‘ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడడం మర్చిపోలేని అనుభవం. మీకో విషయం చెప్పాలి.. ఎంఎస్ ధోనీ అద్బుతమైన వ్యక్తి. తొలిసారి సీఎస్కేకు ఆడుతున్న నాకు ఆయన ఎంతో అండగా ఉన్నాడు. మైదానం బయట కూడా ధోనీ సహచరులకు సమయం కేటాయిస్తాడు. అందరినీ తన గదికి ఆహ్వానిస్తాడు. క్రికెట్ గురించి ఏ సందేహం ఉన్నా తీరుస్తాడు. నిద్రపోతున్నప్పుడు మినహాయించి అతడి గది తలుపు తెరిచే ఉంటుంది. నేను కూడా చాలాసార్లు ధోనీ గదికి వెళ్లాను. ఇద్దరం క్రికెట్ గురించి.. అతడి హాబీల గురించి మాట్లాడుకున్నాం. అతడు నిజంగా స్ఫూర్తినింపే క్రికెటర్’ అని బ్రెవిస్ వెల్లడించాడు.
ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకుంది చెన్నై యాజమాన్యం. తొలిసారి పసపురంగు జెర్సీతో ఈ యంగ్‌స్టర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్కే మిడిలార్డర్ కష్టాలను తీరుస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన ఈ సఫారీ కుర్రాడు 180 స్ట్రయిక్ రేటుతో 225 రన్స్ బాదాడు. పవర్ హిట్టింగ్‌కు కేరాఫ్ అయిన బ్రెవిస్‌ను వచ్చే సీజన్‌కు కూడా చెన్నై అట్టిపెట్టుకునే అవకాశముంది. ఐపీఎల్ ఫామ్‌ను అంతర్జాతీయ టీ20ల్లోనూ చూపించిన బ్రెవిస్ ఆస్ట్రేలియాపై సెంచరీతో గర్జించాడు. పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించాడీ 21 ఏళ్ల డాషింగ్ బ్యాటర్.
DEWALD BREVIS SIXES YESTERDAY vs AUSTRALIA 🤯
– 120 meter
– 111 meter
– 100 meter– 22 year old Dewald Brevis hits one of the longest six in T20I History 👏🏻 pic.twitter.com/edO2KeLnST
— Richard Kettleborough (@RichKettle07) August 17, 2025