BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్జిత్ సైకియా నియామకమయ్యారు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సైకియా ఎన్నికయ్యారు. సైకియా కార్యదర్శిగా ఎన్నుకోవాలని బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సైకియా ప్రస్తుతం తాత్కాలిక కార్యదర్శిగా పని చేస్తున్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా ఖాళీని భర్తీ చేసేందుకు రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి.. నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. జై షా డిసెంబర్ 1, 2024న ఐసీసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయిన 43వ రోజున బీసీసీఐ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
దేవ్జిత్ సైకియా టీమిండియా మాజీ క్రికెటర్. ఆయన 1990 నుంచి 1991 వరకు నాలుగు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. చాలా తక్కువ సమయం క్రికెట్ ఆడారు. ఆయన కెరీర్లో మొత్తం 53 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ తర్వాత న్యాయవాద వృత్తిలో చేరారు. 28 సంవత్సరాల వయసులో గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందాడు. సైకియా క్రికెట్ పరిపాలనలో కెరీర్ 2016లో ప్రారంభమైంది. ఆయన అసోం క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆరుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరు. అసోసియేషన్‌కు ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిస్వా శర్మ నాయకత్వం వహించారు. సైకియా 2019లో ఏసీఏ కార్యదర్శి కాగా.. 2022లో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.