Rishabh Pant : ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్‌కు ముందే రిషభ్ పంత్(Rishabh Pant) ఫ్రాంచైజీ మారుతాడనే వార్తలకు చెక్ పడింది. మెగా వేలానికి ముందే పంత్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జెర్సీ వేసుకుంటాడనే ప్రచారానికి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ముగింపు పలికింది. ఈమధ్యే టీ20 వరల్డ్ కప్‌లో దంచి కొట్టిన పంత్‌ను అట్టిపెట్టుకునేందుకు ఢిల్లీ యాజమాన్యం మొగ్గు చూపుతోంది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel), మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లను కూడా వదిలేయొద్దని ఢిల్లీ భావిస్తోంది.
అయితే.. కొత్త హెడ్‌కోచ్‌గా వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్(Yuvraj Singh)ను సంప్రదించిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. అతడి నియామకంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రికీ పాంటింగ్(Ricky Ponting) వైదొలగడంతో ఢిల్లీకి కొత్త హెడ్‌కోచ్ అవసరం ఏర్పడింది. అయితే.. యువరాజ్ మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్టు అనిపించడం లేదు.
ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. 2021లో ఫైనల్ చేరిన ఢిల్లీ అనూహ్యంగా ఫైనల్లో తడబడింది. 17వ సీజన్లో కెప్టెన్‌గా రిషభ్ పంత్ రాకతో అదరగొట్టిన ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దాంతో, ఆగ్రహించిన యాజమాన్యం హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. అదే క్రమంలో పంత్‌ను సైతం ఢిల్లీ వదిలేస్తుందనే వార్తలు వినిపించాయి.
ఇంకేముంది పంత్ సీఎస్కే జెర్సీ వేసుకోవడం ఖాయం అనుకున్నారంతా. ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ లెఫ్ట్ హ్యాండర్ ‘తాలా’ రజనీ కాంత్(Rajini Kant) మాదిరిగా సోఫాలో స్టయిల్‌గా కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. అంతే.. చెన్నై గూటికి పంత్ అంటూ పోస్టర్లు వెలిశాయి.
కానీ, చివరకు ఈ డాషింగ్ బ్యాటర్‌ను అట్టిపెట్టుకోవాలని జిందాల్ టీమ్ అనుకుంటోంది. ఇక టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్, శ్రీలంక పర్యటనలో రాణించిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌లను కూడా వదిలేయడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ పెద్దలకు మనసొప్పడం లేదట. ఐపీఎల్ మెగా వేలం ఈ ఏడాది డిసెంబర్ ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనుంది. ఆలోపు ఐపీఎల్ జట్లు 18వ సీజన్ కోసం అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనున్నాయి. అప్పటికిగానీ ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని వదిలేసింది? అనేదానిపై స్పష్టత రానుంది.