జైపూర్: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కైల్ జేమీసన్(Kyle Jamieson)కు.. ఐపీఎల్ వార్నింగ్ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత జేమీసన్ ఆవేశంతో ఊగిపోయాడు. బ్యాటర్ వద్దకు అరుచుకుంటూ మీదకు వెళ్లాడు. వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన జేమీసన్ వైఖరిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అతనికి డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రెండో ఓవర్లోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. జేమీసన్ ప్రవర్తన సరిగా లేదన్న ఉద్దేశంతో ఐపీఎల్ అతనికి ఓ డీమెరిట్ పాయింట్ జోడించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్1 ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నది. దాని ప్రకారం అతనికి వార్నింగ్ ఇచ్చారు.
న్యూజిలాండ్ బౌలర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ఉల్లంఘించాడు. అభ్యంతరకరమైన భాష, చర్యలు, సంకేతాలు ఇవ్వడాన్ని ఆర్టికల్ 2.5 కింద తప్పుపడుతారు. బ్యాటర్‌ను రెచ్చగొట్టే రీతిలో జేమీసన్ ప్రవర్తించినట్లు అభిప్రాయపడ్డారు. సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత తన దూకుడు బహేవియర్తో జేమీసన్ అతని మీదకు వెళ్లాడు. ఇలాంటి చర్యలు అవతలి వ్యక్తిని రెచ్చగొట్టేలా చేస్తాయని ఐపీఎల్ పేర్కొన్నది. మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన శిక్షను జేమీసన్ ఆమోదించాడు. శుక్రవానం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై ఢిల్లీ గెలిచింది.