మెల్బోర్న్: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌ను వీడి వెళ్లిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను అర్ధాంతరంగా ఆపివేయడంతో.. కొందరు విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు. అయితే శనివారం నుంచి మళ్లీ మ్యాచ్‌లు పునర్ ప్రారంభంకానున్న నేపథ్యంలో. . కొందరు ఆటగాళ్లు తిరిగి వచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న స్పీడ్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc).. మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు రావడం లేదని స్పష్టం చేశారు. జట్టుతో మళ్లీ కలవడం లేదని ఫ్రాంచైజీలకు స్టార్క్ చెప్పినట్లు సమాచారం ఉన్నది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మిచెల్ స్టార్క్ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఈ సీజన్లో ఆ జట్టు తరపున అతను 11 మ్యాచుల్లో 14 వికెట్లను తీశాడు. అయితే ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలన్న సంకల్పంతో ఉన్న నేపథ్యంలో స్టార్క్ లేకుండా మిగితా టోర్నీ ఆడడం ఆ జట్టుకు కష్టమే కానున్నది. డీసీ జట్టుకు మళ్లీ ఫా డూప్లిసెస్ జత కలుస్తాడో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. కేవలం లీగ్ దశలో ఆడేందుకు మాత్రమే మళ్లీ జట్టుతో కలవనున్నట్లు ట్రిస్టన్ స్టబ్స్ తెలిపాడు. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు వెళ్లనున్నట్లు అతను పేర్కొన్నాడు.
జేక్ ఫ్రేజర్ మెగుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను డీసీ తీసుకున్ని. జేక్ ఫ్రేజర్ మళ్లీ ఇండియాకు రావడం లేదు. ముస్తఫిజుర్ రెహ్మాన్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ .. ఆర్సీబీ జట్టుతో జత కలిసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వెళ్లిన అతను మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు ఇండియా వస్తున్నాడు. ఈ విషయాన్ని అతను కన్ఫర్మ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత కోల్పోయినా.. ఆ జట్టు ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు వస్తున్నారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఆ క్రికెటర్లు నేరుగా లండన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు వెళ్తారు.