ఐపీఎల్-17లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. పోతూ పోతూ లక్నో సూపర్ జెయింట్స్‌ను కూడా వెంట తీసుకెళ్లింది. గత ఆదివారమే బెంగళూరుతో మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్స్ రేసునుంచి అనధికారికంగా తప్పుకున్న క్యాపిటల్స్.. మంగళవారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో లక్నో అవకాశాలపైనా దెబ్బకొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి పొరెల్, స్టబ్స్ మెరుపులతో భారీ స్కోరు అందించగా బౌలింగ్‌లో ఇషాంత్ పేస్‌కు లక్నో టాపార్డర్ దాసోహమంది. పూరన్, అర్షద్ పోరాడినా లక్నోకు ఓటమి తప్పలేదు. లక్నో ఓటమితో కోల్‌కతా తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకుంది.
ఢిల్లీ: ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పోతూ పోతూ ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న లక్నో నాకౌట్ ఆశలపైనా నీళ్లు చల్లింది. మంగళవారం తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ.. లక్నోను 19 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత క్యాపిటల్స్.. పొరెల్ (58), స్టబ్స్ (25 బంతుల్లో 57, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208/4 పరుగులు చేసింది. ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 189/9 పరుగులకు పరిమితమైంది. పూరన్ (27 బంతుల్లో 61, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా ఆఖర్లో అర్షద్ ఖాన్ (33 బంతుల్లో 58 నాటౌట్,3 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. ఇషాంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ సీజన్లో ప్రత్యర్థి బౌలర్లపై చిచ్చరపిడుగులా విరుచుకుపడుతున్నఫ్రేజర్ ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ అయినా మరో ఓపెనర్ పొరెల్.. షై హోప్ ( 38) ఢిల్లీ స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. అర్షద్ ఖాన్ 3వ ఓవర్లో పొరెల్ 4,4,6,4 తో రెచ్చిపోగా యుధ్వీర్ 4వ ఓవర్లో హోప్ 4,4,6 బాదాడు. ఇదే ఊపులో పొరెల్ 21 బంతల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా సాగుతున్న ఢిల్లీ ఇన్నింగ్స్‌లో బిష్ణోయ్ అడ్డుకట్ట వేశాడు. హోప్‌ను బిష్ణోయ్ ఔట్ చేయగా పొరెల్‌ను నవీన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన స్టబ్స్.. పంత్ (33)తో ఢిల్లీకి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దూకుడుగా ఆడే క్రమంలో పంత్ నిష్క్రమించినా అర్షద్ ఖాన్, నవీన్ ఉల్హక్ ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడ్డ స్టబ్స్ 22 బంతుల్లోనే 50 పూర్తిచేసి ఢిల్లీకి భారీ స్కోరును అందించాడు.
లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్ నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. ఇషాంత్ శర్మ వరుస ఓవర్లలో లక్నోకు షాకుల మీద షాకులిచ్చాడు. మొదటి ఓవర్లోనే కెప్టెన్ రాహుల్ (5) ఇచ్చిన క్యాచ్‌ను స్వీపర్ కవర్ వద్ద ముకేశ్ ఒడిసిపట్టాడు. అతడే వేసిన 3వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డికాక్ (12).. ఐదో బంతికి మిడాన్ వద్ద ముకేశ్ చేతికి చిక్కాడు. స్టోయినిస్ రాగానే అక్షర్‌కు బంతినిచ్చిన పంత్.. ఫలితాన్ని రాబట్టాడు. ఇషాంత్ 5వ ఓవర్లో దీపక్ హుడాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో పూరన్ మాత్రం రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ లైన్ దాటించాడు. అక్షర్ 4వ ఓవర్లో 4,6,4,6 దంచినా.. పూరన్ 20 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. కృనాల్ (18) తో కలిసి ఆరో వికెట్‌కు 30 పరుగులు జోడించిన పూరన్‌ను ముకేశ్ ఔట్ చేయడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో అర్షద్ పోరాడినా ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 208/4 (పొరెల్ 58, స్టబ్స్ 57, నవీన్ 2/51, బిష్ణోయ్ 1/26) .
లక్నో: 20 ఓవర్లలో 189/9 (పూరన్ 61, అర్షద్ 58 నాటౌట్, ఇషాంత్ 3/34, స్టబ్స్ 1/4)
