DC vs MI : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో మ్యాచ్‌లో విఫలం అయింది. 105 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచుల్లో శుభారంభం ఇచ్చిన ఓపెనర్ ఫఫాలీ వర్మ (2), యూపీ వారియర్స్‌పై చెలరేగిన జొనాసెన్ (2 స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. కెప్టెన్ మేగ్ లానింగ్ (43), జెమీమా రోడ్రిగ్స్ (25) మాత్రమే రాణించారు. చివర్లో రాధా యాదవ్ ధాటిగా ఆడడంతో ఢిల్లీ వంద పరుగులు చేయగలిగింది.
ముంబై ఇండియన్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, ఢిల్లీ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా పెవిలయన్‌కు క్యూ కట్టారు. మంబై బౌలర్లలో ఏకంగా ముగ్గురు మూడేసి వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ సాయిక్ ఇషక్, ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ ఇసీ వాంగ్ తలా మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరైన సమయంలో బౌలింగ్ ఛేంజెస్ చేసి ఫలితం రాబట్టింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కెప్టెన్ మేగ్ లానింగ్ అంచనాలు తప్పాయి. తొలి ఓవర్ నుంచే పరుగులు రావడం కష్టమైంది. దాంతో, షఫాలీ, ఇషక్ వేసిన రెండో ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకుంది. కానీ, బౌల్డ్ అయింది. ఆ తర్వాత వచ్చిన అలిసే క్యాప్సే(6), మరిజానే కాప్(2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో, 31 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లానింగ్(43)ధాటిగా ఆడింది. జెమీమా, మరిజానేతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంది. కానీ ఆమె జట్టు స్కోర్ 84 వద్ద ఔట్ అయింది.