దోహా: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్..డెన్మార్క్‌పై అద్భుత విజయం సాధించింది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఫ్రాన్స్.. ఈసారి డెన్మార్క్ భరతం పట్టింది. నువ్వానేనా అన్నట్లు ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయ్యింది. శనివారం జరిగిన గ్రూపు-డి మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1తో డెన్మార్క్‌ను ఓడించింది. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ చాంపియన్ టీమ్ ఈనెల 30న ట్యునిషియాతో తమ ఆఖరి పోరులో తలపడుతుంది. అన్నీతానై జట్టును ముందుండి నడిపిస్తున్న స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె(61ని, 86ని) డబుల్ గోల్స్‌తో విజృంభించాడు.
డెన్మార్ రక్షణ శ్రేణిని నిలువరిస్తూ ఇరవై నిమిషాల వ్యవధిలో ఫ్రాన్స్‌కు రెండు గోల్స్ అందించాడు. మెరుపు వేగంతో కదిలిన ఎంబాపె..డెన్మార్క్ గోల్కీపర్ను కంగుతినిపిస్తూ గోల్స్ కొట్టి అభిమానులను సంబురాల్లో ముంచాడు. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్ చేతిలో ఓడిన ఫ్రాన్స్ కసితీరా బదులు తీర్చుకుంది. స్ట్రైకింగ్‌కు ఎంబాపె నాయకత్వం వహించగా సహచరుల నుంచి మంచి మద్దతు లభించింది. అడ్రియాస్ క్రిస్టెన్సెన్(68ని) డెన్మార్క్‌కు ఏకైక గోల్ అందించాడు.
అస్ట్రేలియా 12 ఏండ్ల తర్వాత:
ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. పుష్కర కాలంగా మెగాటోర్నీలో గెలుపు కోసం ఎదురుచూస్తున్న ఆసీస్..ఎట్టకేలకు ట్యునిషియాపై ఈ ఘనత అందుకుంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో కంగారూలకు ఇది మూడో విజయం కావడం విశేషం. మ్యాచ్ 23వ నిమిషంలో మిచెల్ డ్యూక్ ఆసీస్‌కు గోల్ అందించాడు. మిగతా మ్యాచ్‌ల్లో పోలాండ్ 2-0తో సౌదీ అరేబియాపై గెలిచి ముందంజ వేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంగ్లండ్, అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.