అల్ రయాన్: ఫిఫా ప్రపంచకప్‌లో క్రొయేషియా అసమాన పోరాటం కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో పోరాటాన్ని అణువణువున ఒంట పట్టించుకున్న క్రొయేషియా టైటిల్ వేటలో మరింత ముందడుగు వేసింది. గత(2018) ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌కు టైటిల్‌ను చేజార్చుకున్న క్రొయేషియా.. ఈసారి కచ్చితమైన లక్ష్యంతో దూసుకెళుతున్నది. పెనాల్టీ షూటౌట్ తమకు కొట్టిన పిండని నిరూపిస్తూ హాట్ ఫేవరెట్ బ్రెజిల్‌కు చెక్ పెట్టింది. శుక్రవారం ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-4 (పెనాల్టీ షూటౌట్)లో క్రొయేషియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది.
నెయ్మర్ జూనియర్ (105+ని) బ్రెజిల్‌కు ఏకైక గోల్ అందిస్తే.. బ్రూనో పెట్కోవిచ్ (117ని) క్రొయేషియా తరఫున గోల్ చేశాడు. అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్స్ విజేతతో సెమీస్‌లో క్రొయేషియా తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ను షూటౌట్ చేసిన క్రొయేషియా.. అదే ఊపులో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. ఫిఫా ర్యాంకింగ్స్ పరంగా నంబర్‌వన్ టీమ్ బ్రెజిల్‌ను 12వ ర్యాంకర్ క్రొయేషియా నిలువరించిన తీరు అద్భుతం.
మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కడదాకా బ్రెజిల్‌తో ఢీ అంటే ఢీ అన్న క్రొయేషియన్లు తమ కలల కప్‌ను సొంతం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేశారు. బంతిని పట్టు నిలుపుకునేందుకు ఇరు జట్లు ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించడంతో మ్యాచ్‌లో రిఫరీ ఐదు ఎల్లో కార్డులు జారీ చేశాడు. బంతిని బ్రెజిల్ 41 శాతం తమ ఆధీనంలో ఉంచుకుంటే క్రొయేషియా 44 శాతం ఆధిక్యం ప్రదర్శించింది. బ్రెజిల్ ఏకంగా 11 సార్లు క్రొయేషియా గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే..క్రొయేషియా ఒకసారికే పరిమితమైంది.
నెయ్మర్ సూపర్: మ్యాచ్ నిర్ణీత సమయం ఇరు జట్లు గోల్ ఖాతా తెరువకపోవడంతో అదనపు సమయం తప్పనిసరి అయ్యింది. తొలి అదనపు సమయం మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా స్టార్ స్ట్రైకర్ నెయ్మర్ జూనియర్ కండ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. సహచరుల నుంచి పాస్ అందుకున్న నెయ్మర్..క్రొయేషియా డిఫెండర్లను కంగుతినిపిస్తూ బంతిని చాకచక్యంగా పోస్ట్‌లోకి పంపాడు. దీంతో బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన పీలే (77) సరసన నెయ్మర్ నిలిచాడు. అయితే బ్రెజిల్ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. రెండో అదనపు సమయం మూడు నిమిషాల్లో అయిపోతుందనగా క్రొయేషియా స్ట్రైకర్ పెట్కోవిచ్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది.
4ఫిఫా ప్రపంచకప్‌లో నాలుగింటికి నాలుగు సార్లు క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో విజేతగా నిలిచింది. మరోవైపు బ్రెజిల్ నాలుగింటిలో మూడు విజయాలు అందుకుంది.
3ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ చేరడం క్రొయేషియాకు ఇది మూడోసారి. మరోవైపు బ్రెజిల్ వరుసగా రెండోసారి క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.
క్వార్టర్ ఫైనల్లో నేడు
మొరాకో X పోర్చుగల్ రాత్రి 8.30
ఇంగ్లండ్ X ఫ్రాన్స్ అర్ధరాత్రి 12.30