టోక్యో : ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లర్ దీపక్ పూనియా ( Deepak Punia ) అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 86 కేజీల ఫ్రీస్టయిల్ క్యాటగిరీలో.. నైజీరియా రెజ్లర్ ఎకెరికెమి అగియోమోర్‌ను ఓడించాడు. టెక్నికల్ సుపీరియార్టీ పద్ధతిలో 12-1 స్కోర్ తేడాతో బౌట్‌ను దీపక్ గెలుచుకున్నాడు. మహుహరి మెస్సి స్టేడియంలో జరిగిన రెజ్లింగ్ పోటీలో.. దీపక్ పూనియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు మోచేతి గాయానికి లోనైన దీపక్ పూనియా.. తొలి మ్యాచ్‌లో కాస్త నెమ్మదిగా ఆరంభించినా.. ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. బ్రేక్ సమయంలో ఇండియన్ రెజ్లర్ 4-1 తేడాతో లీడ్‌లో ఉన్నాడు. ఇక సెకండ్ పీరియడ్‌లో తన వేగాన్ని మరింత పెంచేశాడు. 2019 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన దీపక్.. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన లిన్ జూషెన్తో తలపడనున్నాడు.