Dipa Karmakar : డోపింగ్ టెస్టులో పట్టుబడిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిషేధంపై స్పందించింది. ఇన్నేళ్లలో ఎన్నడూ కూడా నిషేధిత పదార్థాలను తీసుకోవాలనే ఆలోచనే తనకు రాలేదని, తనకు తెలిసింది జిమ్నాస్ట్ మాత్రమే అని చెప్పింది. అంతేకాదు దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎప్పుడూ చేయను అని దీపా తన ట్వీట్టర్లో వెల్లడించింది. తనపై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలలు నిషేధం విధించిందనే విషయాన్ని ఆమె అంగీకరించింది. అయితే.. మళ్లీ జిమ్నాస్ట్ సాధన చేసేందుకు ఆతృతగా ఉన్నానని దీపా తెలిపింది. ట్విట్టర్లో పోస్ట్‌లో.. ‘2021 అక్టోబర్‌లో నా శాంపిల్‌ను తీసుకొని డోప్ టెస్టుకు పంపారు. నిషేధిత ఉత్ప్రేరం ఉండడంతో టెస్టులో పాజిటివ్ వచ్చింది. అసలు ఆ పదార్థం నా శరీరంలోకి ఎలా వచ్చిందో తెలియదు. అయితే.. అంతర్జాతీయ సమాఖ్య నా విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతో నేను ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నా. ఈ వ్యవహారం మొత్తం సహృదయ వాతావరణంలో జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది’ అని దీప రాసుకొచ్చింది.
ఇంతకు ఏంటీ హిగనమైన్..?
హిగనమైన్ అనేది ఒక నిషేధిత ఉత్ప్రేరకం. ఇది ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుందని, తద్వారా దీన్ని తీసుకున్న అథ్లెట్స్ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాకు చెందిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ తెలిపింది. అందుకని ప్రపంచ డోపింగ్ నిరోధక శాఖ ఈ డ్రగ్‌ను నిషేధిత డ్రగ్స్ బీటా-2 అగోనిస్ట్స్ విభాగంలో చేర్చింది.
దీప ప్రస్థానం ఇది..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు చెందిన దీపా 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో వెలుగులోకి వచ్చింది. ప్రొడునోవ వాల్ట్‌లో అత్యధిక పాయింట్లు సాధించి కాంస్య పతకం గెలిచింది. దాంతో, ఆమె పేరు భారతీయ పత్రికల్లో, టీవీల్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో 4 స్థానంలో నిలిచింది. వరల్డ్ కప్‌లో మెడల్ సాధించిన దీప మరోసారి భారత దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. డోప్ టెస్టులో పట్టుబడడంతో తన నైతిక విలువలు ప్రశ్నార్థకం అయ్యాయని దీపా ఆందోళన వ్యక్తం చేసింది. 2023 జూలై 10 వరకు దీపపై నిషేధం అమలులో ఉంటుందని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
— Dipa Karmakar (@DipaKarmakar) February 4, 2023