ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నోను ఓపెనర్ క్వింటన్ డీకాక్ (80) గెలిపించాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రాహుల్ (24)తో కలిసి శుభారంభం అందించిన డీకాక్.. తోటి బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడుతుంటే తనుమాత్రం ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయంటేనే అతను ఏ రేంజ్లో రెచ్చిపోయాడో తెలుస్తుంది.
రాహుల్, ఎవిన్ లూయిస్ (5) అవుటైన తర్వాత దీపక్ హుడా (11)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు కూడా. అయితే 15వ ఓవర్లో బంతి అందుకున్న సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ రెండో బంతికి దీపక్ హుడా అవుట్ అయ్యాడు. కానీ అది హైట్ విషయంలో నోబాల్‌గా అంపైర్లు ప్రకటించారు.
అంతకుముందు డీకాక్ బ్యాటింగ్ సమయంలో కూడా అలాగే ఒక బీమర్ వేసిన నోర్జీ.. మరో బీమర్ వేయడంతో అతన్ని బౌలింగ్ చేయకుండా ఆపేశారు. దీంతో ఆ ఓవర్ ముగించడానికి వచ్చిన కుల్దీప్.. అదే ఓవర్ చివరి బంతికి డీకాక్‌ను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాదేందుకు డీకాక్ ప్రయత్నించాడు.
కానీ టైమింగ్ మిస్ అవడంతో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది బంతి. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ క్యాచ్ అందుకోవడంతో డీకాక్ వెనుతిరిగాడు. కృనాల్ పాండ్యా (19 నాటౌట్), హుడా (11) కలిసి లక్నోకు విజయాన్ని అందిస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి ఓవర్ తొలి బంతికే హుడాను శార్దూల్ అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన బదోనీ ఢిల్లీ ఆశలను తుడిచిపెట్టేశాడు. అదే ఓవర్ రెండో బంతి డాట్ బాల్ కాగా, మరుసటి రెండు బంతులకు ఫోర్, సిక్స్ బాదిన బదోని (10 నాటౌట్) లక్నోను మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీయగా.. లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇది లక్నోకు వరుసగా రెండో విజయం కాగా, ఢిల్లీకి రెండో ఓటమి, మొత్తమ్మీద ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట ఓడింది.
Lucknow Super Giants Beat Delhi Capitals By 6 Wickets in Indian Premier League 2022 🏏#Cricket #IPL2022 #DCvLSG #LSGvDC #DCvsLSG #LSGvsDC #SportsTrendsCan pic.twitter.com/80D8BppWfZ
— SportsTrendsCanada (@SportsTrendsCan) April 7, 2022