David Warner: సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు త్వరలోనే ముగింపు పలకబోతున్న డేవిడ్ వార్నర్‌కు ఊహించని షాక్ తగిలింది. త్వరలో సిడ్నీ వేదికగా మొదలుకాబోయే ఆఖరి టెస్టుకు ముందు వార్నర్ తన బ్యాగ్‌ను ఎవరో దొంగిలించారని, దయచేసి దానిని తిరిగిచ్చేయాలని ఇన్స్టాగ్రామ్ వేదికగా కోరాడు. ఆ బ్యాగ్‌లో తనకు ఎంతో ఇష్టమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ ఉందని, దానిని ధరించే తాను చివరి టెస్టు ఆడదామని అనుకుంటున్నానని వార్నర్ వీడియో వేదికగా అభ్యర్థించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వార్నర్ మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం.. ఇది (సిడ్నీ టెస్టు) నా చివరి ప్రయత్నం. మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వచ్చే క్రమంలో నా బ్యాక్‌ప్యాక్‌ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లలకు చెందిన విలువైన వస్తువులతో పాటు నాకెంతో ఇష్టమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. ఈ మేరకు నేను సిడ్నీ, మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులలో వీడియో పుటేజీ కూడా చెక్ చేశాను. కానీ వాళ్లు మాత్రం బ్యాగ్‌లు ఎవరూ తెరవలేదని అంటున్నారు. కానీ నా బ్యాగ్ మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ మీలో ఎవరైనా అది తీసినా.. మీకు కనిపించినా దయచేసి నాకు అది తిరిగిచ్చేయండి. నా చివరి టెస్టును ఆ క్యాప్ ధరించే ఆడాలనుకుంటున్నా. నా బ్యాగ్ తీసుకున్నందుకు మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకూ గురి చేయను..’ అని పేర్కొన్నాడు.
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే మూడో టెస్టే వార్నర్‌కు తన కెరీర్లో ఆఖరి టెస్టు. ఇప్పటివరకూ 111 టెస్టులు ఆడిన వార్నర్.. 44.59 సగటుతో 8,695 పరుగులు చేశాడు. ఇందులో 26 శతకాలు, 36 అర్థ సెంచరీలూ ఉన్నాయి. వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. ఈ ఫార్మాట్లో 161 మ్యాచ్‌లు ఆడి 6,932 రన్స్ చేశాడు. వన్డేలలో వార్నర్.. 22 సెంచరీలు, 33 శతకాలు సాధించాడు. టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్నా వార్నర్.. టీ20లలో మాత్రం కొనసాగనున్నాడు.