David Warner | ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని.. తన అవసరం ఉందనుకుంటే మాత్రమే ఆడుతానన్నాడు. వార్నర్ 2023లో వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టు ఆసిస్ జట్టులో డేవిడ్ వార్నర్ సభ్యుడు. జట్టు తరఫున అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ వార్నర్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో 510 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలున్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్లో 500కు పైగా పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా నిలిచాడు. వార్నర్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. తాజాగా టీ20ల నుంచి సైతం తప్పుకున్నట్లు ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం జీవితాన్ని కుటుంబం కోసం కేటాయిస్తానని చెప్పాడు. కుటుంబానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వచ్చిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
టీ20ల్లో కొంతకాలం కొనసాగాలని భావించాడు. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సూపర్-8 దశలో వెనుకపడింది. ఆఫ్ఘనిస్థాన్, భారత్ జట్ల చేతిలో పరాజయం పాలవడంతో వార్నర్ తన నిర్ణయంపై పునరాలోచించాడు. ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో బ్యాట్‌తో రాణించలేకపోయాడు. అయితే, వచ్చే ఏడాది జరిగే 50 ఓవర్ల వన్డే క్రికెట్ ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే.. జట్టులో తనకు స్థానం కల్పించవచ్చన్నాడు. ఇదిలా ఉండగా.. వార్నర్ కెరీర్లో 112 టెస్టులు ఆడి 44.58 సగటుతో 8,766 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోరు 335 నాటౌట్. ఇక వన్డేల్లో ఇప్పటి వరకు 161 మ్యాచ్‌లు ఆడి.. 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 110 మ్యాచ్‌లల్లో 3,277 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.