ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కంగూరాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లుంది. ఆ జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ వేసిన బంతి.. వార్నర్ పక్కటెముకలకు బలంగా తగిలింది.
దీంతో బాధతో వార్నర్ విలవిల్లాడాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా అదే ప్లేస్‌లో వార్నర్‌కు మరోసారి దెబ్బ తగిలింది. దీంతో అతను మూడోరోజు ఫీల్డింగ్‌కు రాలేదు. బ్రేక్ సమయంలో బయటకు వచ్చిన అతను.. పక్కటెముకలపై ఒక గార్డ్ పెట్టుకొని కనిపించాడు.
ఈ క్రమంలో తర్వాతి మ్యాచుల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనింగ్ ఎవరు చేస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. దీనిపై ఆసీస్ లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఒకవేళ వార్నర్ గనుక ఓపెనింగ్ చేయలేకపోతే, ఉస్మాన్ ఖవాజాతో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని పాంటింగ్ ప్రతిపాదించాడు.
‘ఖవాజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కొంతకాలంగా ఖవాజా ఓపెనింగ్ బ్యాటర్‌గా రాలేదనే మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం అతని కన్నా మంచి ఆప్షన్ కనిపించడం లేదు. కాబట్టి ఇలా చేయడమే సరైనది’ అని పాంటింగ్ చెప్పాడు. వార్నర్ గాయం తీవ్రత గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అసలు చేస్తాడా తెలియడం లేదని పాంటింగ్ అన్నాడు. ఒకవేళ బ్యాటింగ్‌కు వస్తే అతని గాయం తీవ్రతపై ఒక అంచనాకు రావొచ్చని అభిప్రాయపడ్డాడు.