జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న సౌత్ఇండియా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో దర్శణ కోలి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల అండర్-16 46కిలోల విభాగంలో 6-5, 7-5 తేడాతో ఐశ్వర్యపై అద్భుత విజయం సాధించింది. మిగతా విభాగాల్లో నీలాసాయి శ్రీ(తమిళనాడు), షశ్మిత(తమిళనాడు), ఆకాంక్ష(తెలంగాణ) విజేతలుగా నిలిచారు.
పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి పోటీలలో దక్షిణాది రాష్ర్టాల నుంచి సుమారు 700 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం కోశాధికారి మహేశ్వర్, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మీర్ వహజ్అలీ పాల్గొన్నారు.