దీపావళి ముగిసినా భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు గురువారం ‘డబుల్ బ్లాక్ బస్టర్ బొనాంజా’ను పట్టుకొచ్చింది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడుతున్న మహిళల జట్టుతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పురుషుల జట్లు తమ ప్రత్యర్థులతో నేడు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక తొలి వన్డేలో ఓడటంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిలుపుకోవాలంటే విజృంభించాల్సిన స్థితి గిల్ సేనది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా అభిమానులకు రోజంతా క్రికెట్ మజా అందనుండటం ‘డబుల్ గ్యారెంటీ’..
ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా హ్యాట్రిక్ ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత మహిళల జట్టు గురువారం న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీస్ చేరాలంటే ఇరుజట్లకూ నేటి పోరు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నాలుగో బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్నట్టే! ఈ నేపథ్యంలో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న పోరు రసవత్తరంగా సాగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది.
ఒత్తిడిలో కౌర్ సేన..
రెండు వరుస విజయాలతో టోర్నీని ఆరంభించిన టీమ్ఇండియా తర్వాత గెలుపుటంచులదాకా వచ్చిన మ్యాచ్‌లను చేజేతులా వదిలేసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి నెలకొనడంతో కౌర్ సేన ఒకింత ఒత్తిడిలో కనబడుతున్నది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ కాస్త మెరుగైనప్పటికీ బౌలింగ్ భారత్‌ను తీవ్రంగా వేధిస్తున్నది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను తప్పించి పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ను తీసుకున్నా బౌలింగ్ విభాగం మెరుగుపడలేదు. తొలి రెండు మ్యాచ్‌లలో మెప్పించిన క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ తర్వాత ఆకట్టుకోలేకపోగా భారీగా పరుగులిచ్చుకుంటున్నారు.
రేణుకా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నియంత్రణతో బౌలింగ్ చేసినా వికెట్లు తీయడంలో విఫలమైంది. మరి ఈ బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికొస్తే స్మృతి, హర్మన్‌ప్రీత్ గత మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చినా ఆ ఇద్దరూ మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ జోడీ క్రీజులో ఉండగా గెలుపు దిశగా పయనించిన ఉమెన్ ఇన్ బ్లూ.. ఆ తర్వాత తడబడి ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. ఓపెనర్ ప్రతీక, హర్లీన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఆఖర్లో ఫినిషర్ లేని లోటు టీమ్ఇండియాను వేధిస్తున్నది. రిచా ఘోష్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మినహా పెద్దగా రాణించింది లేదు.
కివీస్‌కూ కీలకమే..
కొలంబోలో ఆడిన గత రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యావశ్యకం. బ్యాటింగ్‌లో ప్రధానంగా కెప్టెన్ సోఫీ డెవిన్, సూజీ బేట్స్ మీద కివీస్ ఆధారపడుతున్నది. డెవిన్ అయితే ఒక శతకం, రెండు అర్ధ శతకాలతో టోర్నీ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచింది. ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌కు ఇక్కడ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పదుల సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. మిడిలార్డర్లో హ్యాలీడేకీలకం కానుంది.
వర్షం ముప్పు?
మూడు బెర్తులు ఖాయమైన వరల్డ్ కప్‌లో నాలుగో బెర్తు కోసం తలపడుతున్న భారత్, కివీస్‌కు ఈ పోరు నాకౌట్ మ్యాచ్ వంటిదే. ఒకవేళ వర్షం వల్ల రైద్దెతే అప్పుడు ఇరుజట్లకూ తమ ఆఖరి మ్యాచ్‌లు కీలకమవుతాయి. నేటి మ్యాచ్‌కూ వరుణుడు అంతరాయం కల్గించవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌కూ వర్షం అడ్డంకులు సృష్టించింది.
తుది జట్లు (అంచనా)
భారత్: మంధాన, ప్రతీక, హర్లీన్, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), రిచా, అమన్‌జ్యోత్, స్నేహ్, దీప్తి, రేణుకా/జెమీమా, క్రాంతి, చరణి
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమెలియా, డెవిన్, హ్యాలీడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోస్మెరి, కార్సన్, తహుహు