Marco Jansen: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అంచనాలకు మించి రాణిస్తున్నది. అన్ని రంగాలలో సమిష్టిగా రాణిస్తన్న సఫారీలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వంటి బ్యాటర్లతో పాటు బౌలింగ్‌లో రబాడా, కొయెట్జ్, ఎంగిడీలు దక్షిణాఫ్రికా విజయాలలో భాగస్వాములవుతున్నారు. వీళ్లందరికంటే సఫారీ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న మరో ఆటగాడు మార్కో జాన్సెన్. 23 ఏండ్ల ఈ యువ పేస్ ఆల్ రౌండర్.. అద్భుత ప్రదర్శనలతో ప్రపంచకప్‌లో సఫారీల సవారీని దగ్గరుండి నడిపిస్తున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో దుమ్మురేపుతూ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్నాడు.
దిగ్గజాల బాటలో..
గతంలో నాణ్యమైన పేస్ ఆల్ రౌండర్లను ప్రపంచ క్రికెట్‌కు అందించిన చరిత్ర సౌతాఫ్రికాకు ఉంది. బ్రియాన్ మెక్మిలాన్, షాన్ పొలాక్, లాన్స్ క్లూసెనర్ తో పాటు వరల్డ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ జాక్వస్ కలిస్ కూడా ఆ దేశానికి చెందినవాడే. 90వ దశకంతో పాటు ఈ శతాబ్దపు తొలినాళ్లలో ప్రొటీస్ జట్టు విజయాలలో కలిస్, పొలాక్, క్లూసెనర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కానీ ఈ త్రయం నిష్క్రమణ తర్వాత ఆల్బీ మోర్కెల్ కొద్దిరోజుల పాటు ఆ బాధ్యతలను నిర్వర్తించాడు.
మోర్కెల్ రిటైర్ అయ్యాక సౌతాఫ్రికాకు నిఖార్సైన పేస్ ఆల్ రౌండర్ కొరత వేధిస్తోంది. మధ్యలో క్రిస్ మోరిస్ వంటి ఆటగాళ్లు వచ్చినా వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కానీ రెండేండ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్సెన్.. సౌతాఫ్రికాకు పేస్ ఆల్ రౌండర్ కొరతను తీరుస్తున్నాడు. 2022లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు టెస్టులలో బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించిన జాన్సెన్.. బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. వన్డేలలో గతేడాది భారత్‌తో మ్యాచ్‌లోనే ఎంట్రీ ఇచ్చిన జాన్సెన్.. లోయరార్డర్లో ఉపయుక్తకరమైన పరుగులు చేస్తున్నాడు. ఇప్పటివరకూ 20 వన్డేలు ఆడిన జాన్సెన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ 35.27 సగటుతో 388 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 31 వికెట్లు పడగొట్టాడు.
వరల్డ్ కప్‌లో సూపర్ హిట్..
వరల్డ్ కప్‌లో జాన్సెన్ను దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్‌గా తీసుకొచ్చింది. రబాడా వంటి వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌ను సైతం పక్కనబెట్టి జాన్సెన్‌తో తొలి ఓవర్ వేయిస్తోంది. అతడు కూడా జట్టు నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ (పాకిస్తాన్ మ్యాచ్‌తో కలిపి) లు ఆడిన జాన్సెన్.. ప్రతీ మ్యాచ్‌లోనూ 2 వికెట్లు (పాకిస్తాన్‌తో మూడు వికెట్లు) తీసిన అతడు మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. ప్రారంభ ఓవర్లలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను ఒత్తిడి లోకి నెట్టడంలో జాన్సెన్ సక్సెస్ అవుతున్నాడు. బంతితోనే గాక బ్యాట్‌తో కూడా జాన్సెన్ రెచ్చిపోతున్నాడు. ఈనెల 21న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ 35 బంతుల్లోనే 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతడు.. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఐసీసీ ట్రోఫీ నెగ్గని జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు జాన్సెన్ మెరుపులతో పాటు మిగతా ఆటగాళ్ల ప్రదర్శన తోడైతే భారత్‌లో ఆ జట్టు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.