CWC 2023: ఆస్ట్రేలియా – నెదర్లాండ్స్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం చేసి వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. డచ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన మ్యాక్సీ ఆ తర్వాత 13 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ శతకంతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న మ్యాక్స్‌వెల్ ఖాతాలో మరో ఘనత చేరింది.
వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్లలో గతంలో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్.. 51 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై ఏబీడీ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే టోర్నీలో మ్యాక్సీ కూడా శ్రీలంకపై 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కాగా వన్డేలలో అత్యంత వేగంగా సెంచరీ చేసినవారి జాబితాలో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. డివిలియర్స్.. 2015లో జోహన్నస్బర్గ్ వేదికగా వెస్టిండీస్‌పై 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఇక టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసినే వారిలో క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. 30 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా గేల్ పేరిటే ఉంది. గేల్.. 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక భారత్ విషయానికొస్తే వన్డేలలో ఫాస్టెస్ట్ సెంచరీ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 2013లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో శతకం బాదాడు. యాధృశ్చికంగా ఈ నలుగురూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడినవారే కావడం గమనార్హం. వన్డేలలో వేగవంతమైన సెంచరీ, వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు 2021లో కలిసిఆడారు. ఇక కోహ్లీ, మ్యాక్సీలు గత మూడేండ్లుగా ఆర్సీబీ తరఫున సహచరులే. గేల్, డివిలియర్స్, కోహ్లీలు కొన్నాళ్లపాటు ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్నారు. తాజాగా మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ గణాంకాలు, నలుగురు స్టార్ బ్యాటర్లు కలిసి ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.