ఫార్ములా-ఈ రేసింగ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసుకు మన హైదరాబాద్ వేదిక కాబోతున్నది. హుసేన్సాగర్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ఫార్ములా కార్లు రాకెట్ వేగంతో రయ్‌మంటూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తం 11 జట్లు 22 కార్లు బరిలోకి దిగనున్న రేసింగ్‌లో హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. వాతావరణ కాలుష్యానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పర్యావరణ హితంగా జరుగబోతున్న ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ నగరవాసులకు కొత్త అనుభూతిని అందించనుంది. అసలు ఫార్ములా-ఈ ఏంటీ, దాని ప్రధాన ఉద్దేశం, అర్హత ఫార్మాట్, పాయింట్స్, న్యూ జెన్-3 కార్లు ఇలా ఆసక్తికరమైన అంశాలతోప్రత్యేక కథనం.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం..
ఫార్ములా రేసింగ్…భారతీయులకు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న సాహాసోపేతమైన క్రీడ. రోమాలు నిక్కబొడిచే రీతిలో కన్నురెప్పపాటులో వాయువేగంతో దూసుకెళ్లే రేసింగ్‌కు మన దేశంలోనూ క్రేజ్ ఊపందుకుంటున్నది. క్రికెట్ లాంటి మాస్ ఆట నీడలో ఇన్నాళ్లు సామాన్య జనాలకు చేరువ కాలేకపోయిన రేసింగ్ స్ట్రీట్ సర్క్యూట్‌తో పరిచయం కాబోతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గ్రీన్కో సంస్థతో కలిసి ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్నది. హుసేన్సాగర్ తీర ప్రాంతాన్ని ఆనుకుని 2.8 కి.మీల నిడివితో ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్‌పై ఈనెల 10, 11తేదీల్లో ఫార్ములా రేసింగ్ జరుగబోతున్నది. ఈ నేపథ్యంలో అసలు ఫార్ములా-ఈ రేసింగ్ అంటే ఏంటీ, అర్హత ఫార్మాట్, రేస్ ఫార్మాట్, పాయింట్స్ మొదలైన అంశాలపై మనం ఒక లుక్కు వేద్దాం పదండి.
సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం 2014లో ఫార్ములా-ఈ రేసింగ్ పురుడుపోసుకుంది. అప్పటి వరకు ప్రత్యేకమైన ఇంధనంతో నడిచిన ఫార్ములా-1 కార్లను చూసిన అభిమానులకు ఎలక్ట్రిక్ బ్యాటరీలతో రూపొందించిన కార్లు ట్రాక్‌పై పరుగుపెట్టడం కొత్త అనుభూతి కల్గించింది. ఇలా ఎనిమిదేండ్లుగా వివిధ దేశాల్లో ఫార్ములా-ఈ రేసింగ్‌లు కోట్లాది అభిమానాన్ని చూరగొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తొలిసారి హైదరాబాద్‌లో రేసింగ్ జరుగబోతున్నది. మొత్తం 11 జట్లు 22 మంది రేసర్లు పోటీపడనున్నారు. ట్రాక్‌పై ఎవరు వేగంగా వెళ్లడం అన్న ఉద్దేశంతో కాకుండా బ్యాటరీ సామర్థాన్ని అంచనా వేస్తూ డ్రైవర్లు ముందుకు సాగనున్నారు. అందుకోసం అన్ని కార్లను ఒకే రకమైన సాంకేతికతో నిర్మించారు. ముఖ్యంగా ఇంజిన్, ట్రాన్స్మిషన్, ఇన్వర్టర్, రేర్ సస్పెన్షన్, చాసిస్, బ్యాటరీ లాంటి విషయాల్లో అన్ని కార్లు ఒకే రకంగా ఉండటం విశేషం. 2020లో ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ హోదాకు ఎఫ్ఐఏ నుంచి అనుమతి వచ్చింది.
ప్రధాన రేసుకు ముందు జరిగే క్వాలిఫయింగ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇందులో ర్యాంకింగ్స్‌లో సరి సంఖ్యలతో ఒక గ్రూపు, బేసి సంఖ్యలతో కూడిన జట్లతో మరో గ్రూపుగా ఏర్పడి గ్రూపు దశలో తలపడుతాయి. అర్హత రౌండ్లో డ్రైవర్లకు 300కేవీ వరకు ఉపయోగించుకునేందుకు అవకాశముంటుంది. ప్రతి గ్రూపు నుంచి నలుగురు డ్రైవర్లు ఏ-1, ఏ-2, బీ-1, బీ-2గా విడిపోయి జట్లుగా క్వార్టర్స్‌లో తలపడుతారు. ఇందులో నుంచి సెమీస్‌కు నలుగురు డ్రైవర్లు అర్హత సాధిస్తారు. ఫైనల్లో ఇద్దరు రేసర్లు టైటిల్ కోసం ఢీ అంటే ఢీ అంటారు. రన్నరప్‌కు రెండో స్థానం, సెమీస్‌లో ఓడిన డ్రైవర్లకు మూడు, నాలుగు స్థానాలు దక్కుతాయి.
ఫార్ములా-ఈ రేసింగ్‌లో అటాక్ మోడ్ ఉంటుంది. ఫార్ములా-1 రేసులతో పోల్చుకుంటే ఫార్ములా-ఈలో ల్యాప్‌లు ఎక్కువ ఉంటాయి. రేసును మరింత ఆసక్తికరంగా మలిచేందుకు అటాక్ మోడ్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా డ్రైవర్లకు 50కేడబ్ల్యూ శక్తి అందుతుంది. రేసింగ్‌లో కీలకమైన ఓవర్ టేకింగ్‌లు చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రెండు దశల్లో డ్రైవర్లు అటాక్ మోడ్‌ను వినియోగించుకునే అవకాశముంటుంది. ప్రధాన రేసుకు ముందు అటాక్ మోడ్ నిడివిని నిర్ధారిస్తారు. ఉదాహరణకు నాలుగు నిమిషాలుంటే డ్రైవర్లు దాన్ని 2-2 లేదా 3-1,1-3 గా విభజించుకుంటారు.