CSK vs RCB | ఐపీఎల్లో భాగంగా దుబాయి వేదికగా రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో ధోనీసేన విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన.. 6 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. విరాట్ కోహ్లీ (53), పడిక్కల్ (70) అర్ధ శతకాలతో మెరిశారు. జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. కానీ పరుగులు తీయడంలో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. మెరుపులు మెరిపిస్తాడని అనుకున్న డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ (1), హర్షల్ పటేల్ (3), హసరంగ(1) ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లు ఎక్కడికి అక్కడ కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 156 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ధోనీసేన శుభారంభం చేసింది. గైక్వాడ్ (38), డుప్లెసిస్ (31) పరుగులతో ఆకట్టుకున్నారు. కానీ చెన్నై ప్లేయర్ల దూకుడును.. బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. టైట్ బౌలింగ్‌తో పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (23), అంబటి రాయుడు (32) ఇద్దరూ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అయినప్పటికీ నిలకడగా ఆడిన ధోనీసేన లక్ష్యాన్ని చేధించింది. బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది.