Lionel Messi : లెజెండరీ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. అతడు ఎంతో తెలివిగా ప్రత్యర్థులను బోల్తా కొట్టించి గోల్ చేయగల సమర్థుడు. ఈమధ్యే ఇంటర్ మియామి క్లబ్(Inter Miami)కు మారిన ఈ దిగ్గజ ఆటగాడిపై క్రుజ్ అజుల్(Cruz Azul) క్లబ్ మిడ్‌ఫీల్డర్ ఎరిక్ లిరా (Erik Lira) షాకింగ్ కామెంట్లు చేశాడు. మెస్సీకి అందరిలానే రెండు కళ్లు, రెండు కాళ్లు ఉన్నాయని, అతడి నుంచి తమకు ఏమంత ప్రమాదం లేదని అన్నాడు.
‘మెస్సీకి రెండు కళ్లు, రెండు కాళ్లు ఉన్నాయంతే. అతను మరొక ఫుట్‌బాలర్ అంతే. అయితే.. మైదానంలో అతడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. అయినా సరే.. మేమే గెలుస్తాం’ అని ఎరిక్ లిరా తెలిపాడు. అతడి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జూలై 21న ఇంటర్ మియామి, క్రుజ్ అజుల్ క్లబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దాంతో, ఎరిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ ఈ ఏడాది ‘చాంపియన్స్ లీగ్ గోల్ ఆఫ్ ది సీజన్’ (Champions League goal of the season award)అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. రియల్ మాడ్రిడ్ ఆటగాడు వినిసియస్ జూనియర్(Vinicius Jr), ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland)లను వెనక్కి నెట్టి మరీ మెస్సీ ఈ అవార్డు దక్కించుకున్నాడు. పీఎస్జీ(PSG) క్లబ్ తరఫున ఆడిన సమయంలో బెన్ఫికా(Benfica) జట్టుపై చేసిన గోల్ అతడికి ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఎడమ కాలితో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు.
లియోనల్ మెస్సీ
పీఎస్జీతో రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో మెస్సీ ఈమధ్యే అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మారాడు. అతడిని దక్కించుకునేందుకు బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al Hilal) ప్రయత్నించాయి. కానీ, అతను ఇంటర్ మియామికి ఓకే చెప్పాడు. మేజర్ సాకర్ లీగ్(Major Soccer League)లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.