Tamim Iqbal : బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్(Bangladesh ODI Captain)తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ప్రపంచంలోని విధ్వంసక బ్యాటర్లలో ఒకడైన అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించిన అతను భావోద్వేగానికి లోనయ్యాడు. ధనాధన్ ఆటతో బౌలర్లను ఉతకారేసిన అతను కన్నీటిపర్యంతమవ్వడం చూసి అభిమానులు చలించిపోయారు.
‘ఇది నా కెరీర్‌కు ముగింపు. ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. వీడ్కోలు విషయమై ఇంట్లోవాళ్లతో మాట్లాడాను. మానాన్న కలను నిజం చేయడం కోసం నేను క్రికెట్లోకి అడుగుపెట్టానని పదే పదే చెప్పాను. అందుకని ఈ సమయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు. అయితే.. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మైదానంలో దిగిన ప్రతిసారి నా ఉత్తమ ప్రతిభను కనబరిచాను. జట్టు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేశాను. అయితే.. నేను కొన్నిసార్లు అంచనాలను అందుకోవడంలో విఫలం కావొచ్చు. కానీ 100 శాతం ప్రయత్నించాను’ అని తమీమ్ వెల్లడించాడు. . దాంతో, అతడి 16 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. బంగ్లాదేశ్ తరఫున అతను బుధవారం ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఇప్పటివరకు తమీమ్ 241 వన్డేలు ఆడాడు.
తమీమ్ ఇక్బాల్
తమీమ్ 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే బంగ్లాదేశ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఉత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లా.. పెద్ద జట్లకు షాక్ ఇవ్వడంలో తమీమ్ పాత్ర ఎంతో ఉంది. మరో విషయం ఏంటంటే.. అతనికి టీమిండియా(Team India)పై ఘనమైన రికార్డు ఉంది. అవును.. అతడి 56 అర్ధ శతకాల్లో భారత్‌పై చేసినవే ఎక్కువ. ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్ సంచలన ఇన్నింగ్స్‌లకు చిరునామాగా మారాడు. ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే అతను బంగ్లా జట్టుకు దూకుడు నేర్పాడు. కీలక మ్యాచుల్లో మెరపు బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో.
ముష్రఫే మొర్తాజా(Mashrafe Mortaza)నుంచి తమీమ్ 2020లో వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. అతడి కెప్టెన్సీలో బంగ్లా 37 మ్యాచుల్లో 21 సార్లు గెలుపొందింది. టెస్టుల్లోనూ ఈ లెఫ్ట్ హ్యాండర్ 10 శతకాలతో సత్తా చాటాడు. అతను 2009లో వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో తొలి సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విండీస్‌ను ఓడించి, విదేశీ గడ్డపై తొలి విజయం నమోదు చేసింది. స్వదేశంలో ఈ మధ్యే అఫ్గనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఇక్బాల్ దూరమయ్యాడు. అయితే.. వన్డే సిరీస్‌లో మాత్రం ఆడాడు. తమీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న లిట్టన్ దాస్(Litton Das) వన్డే జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉందనగా తమీమ్ ఆట నుంచి తప్పుకోవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.