Cristiano Ronaldo : భారత్‌లోని క్రీడాభిమానులకు గుడ్‌న్యూస్. ఫుట్‌బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) త్వరలోనే ఇండియాకు వస్తున్నాడు. తన ఆటతో మన ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడీ లెజెండ్. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ (AFC Champions League) మ్యాచ్ కోసం ఈ స్టార్ ఫార్వర్డ్ మనదేశం రానున్నాడు. శుక్రవారం ఆసియా ఫుట్‌బాల్ సంఘం లీగ్ డ్రాలను ప్రకటించింది.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఏఎఫ్సీ హౌస్‌లో ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్ డ్రా తీశారు. రొనాల్డో సారథ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్ గ్రూప్ డీలో ఉంది. అదే గ్రూప్‌లో ఇండియన్ సూపర్ లీగ్(ISL)కు చెందిన ఎఫ్‌సీ గోవా (FC Goa) జట్టు కూడా ఉండడంతో ఈ వెటన్ ప్లేయర్ రాక అనివార్యం కానుంది.
గ్రూప్ డీలో ఎఫ్‌సీ గోవా, అల్ జవ్రా ఎఫ్‌సీ (ఇరాక్), ఎఫ్‌సీ ఇస్తిక్లోల్(తజకిస్థాన్) జట్లు ఉన్నాయి. రొనాల్డో కెప్టెన్సీలో అద్భుత విజయాలు సాధిస్తున్న అల్ నస్రీ క్లబ్ సౌదీ ప్రో లీగ్‌లో మూడో స్థానంతో ఈ లీగ్‌కు అర్హత సాధించింది. ఐఎస్ఎల్ 2024/25 లీగ్ సీజన్లో గోవా టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో సూపర్ కప్‌లో విజేతగా నిలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది గోవా. అదే జోష్‌తో ఒమన్‌కు చెందిన అల్ సీబ్ జట్టును ఓడించి ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది.