అల్గార్వ్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో( Cristiano Ronaldo ) ఫుట్‌బాల్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం లగ్జెంబర్గ్తో జరిగిన మ్యాచ్‌లో అతడు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రొనాల్డోకు ఇది 10వ హ్యాట్రిక్ కావడం విశేషం. అతని హ్యాట్రిక్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0తో గెలిచింది. అంతేకాదు రొనాల్డో ఇంటర్నేషనల్ గోల్స్ సంఖ్య 115కు చేరింది. ఇప్పటి వరకూ అతడు 182 మ్యాచ్‌లు ఆడాడు. గత నెలలోనే ఇరాన్‌కు చెందిన అలీ డేయీ అత్యధిక గోల్స్ రికార్డును బద్ధలుకొట్టిన రొనాల్డో.. తన దూకుడును కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకున్న రొనాల్డో.. తాజాగా అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్ రికార్డునూ అందుకున్నాడు. మొత్తంగా అతని కెరీర్ హ్యాట్రిక్‌ల సంఖ్య 58కి చేరింది. సమకాలీన ఫుట్‌బాలర్స్‌లో ఎవరూ అతనికి దరిదాపుల్లో లేరు. ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్న రొనాల్డో యురోపియన్ చాంపియన్‌షిప్స్‌లో, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డీ ఓర్ అవార్డు రేసులో అతడు లియోనెల్ మెస్సీ (38 గోల్స్)తో సమంగా ఉన్నాడు.