న్యూఢిల్లీ: ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యేందుకు క్రికెటర్లు నిషేధిత ఇంజెక్షన్లు తీసుకుంటారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఆరోపించారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. వంద శాంత ఫిట్‌గా ఉన్నారని తెలిపేందుకు క్రికెటర్లు డ్రగ్స్ ఉండే ఇంజెక్షన్లు తీసుకుంటారని, డోపింగ్‌లో పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చేతన్ శర్మ ఆరోపించారు.
80 శాతం ఫిట్ ఉన్న క్రికెటర్లు.. జట్టులో స్థానం కోసం.. వంద శాతం ఫిట్‌గా ఉండేందుకు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ తెలిపారు. ఆ ఇంజెక్షన్లు పెయిన్ కిల్లర్లు కావని, డోప్ పరీక్షల్లో దొరకని డ్రగ్స్ దాంట్లో ఉంటాయని అన్నారు. ఫిట్నెస్ పరీక్ష క్లియర్ అయ్యేందుకు పర్సనల్ డాక్టర్లతో ఆ ఇంజెక్షన్లు ఇప్పించుకుంటారని తెలిపారు.
దొంగచాటుగా వెళ్లి ఇంజెక్షన్లు తీసుకునే ఆటగాళ్లపై 24 గంటలు నిఘా పెట్టలేమన్నారు. శిక్షణ సమయంలో తమతోనే ఉన్నా.. రూమ్‌కు వెళ్లిన తర్వాత తమ పర్సనల్ డాక్టర్లతో ఇలాంటి పనులు చేయిస్తుంటారని చేతన్ శర్మ ఆరోపించారు. తనకు కూడా పర్సనల్ లైఫ్ ఉండడం వల్లే .. క్రికెటర్లపై నిత్యం నిఘా పెట్టలేకపోతున్నట్లు తెలిపారు.